

హైదరాబాద్: ఐపీఎల్ 2019 సీజన్‌లో తనను అట్టిపెట్టుకున్న చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే)కు కేదార్ జాదవ్ ధన్యవాదాలు తెలియజేశాడు. ఐపీఎల్ 2019 కోసం డిసెంబర్ నెలలో వేలం నిర్వహించనున్నారు. దీంతో వచ్చే సీజన్ కోసం ఫ్రాంఛైజీలు ఇప్పటి నుంచే తమ కసరత్తులను ముమ్మరం చేసాయి.
నవంబర్ 15లోగా ఫ్రాంచైజీలు తాము రిటైన్ చేసుకున్న ఆటగాళ్ల జాబితాను అందించాలని ఐపీఎల్ నిర్వాహకులు సూచించడంతో ఫామ్‌లో లేని ఆటగాళ్లందరినీ ఐపీఎల్ ఫ్రాంచైజీలు విడుదల చేశాయి. ఈ క్రమంలో భాగంగా చెన్నై సూపర్‌కింగ్స్ ఇంగ్లిష్ క్రికెటర్ మార్క్ వుడ్‌తో సహా గత సీజన్‌లో ఒక్క మ్యాచ్ కూడా ఆడని క్షితిజ్ శర్మ, కనిష్క్ సేత్‌లను విడుదల చేసింది.
గత సీజన్‌లో రూ.7.80 కోట్ల ధరతో కేదార్ జాదవ్‌ను దక్కించుకున్న చెన్నై సూపర్ కింగ్స్ అట్టిపెట్టుకున్న జాబితాలో ఉంచింది. తద్వారా చెన్నై సూపర్ కింగ్స్ ప్రాంఛైజీకి ట‍్వీటర్ ద్వారా కేదార్ జాదవ్ కృతజ్ఞతలు తెలియజేశారు. "నన్ను సీఎస్‌కే అట్టిపెట్టుకున్నందుకు చాలా రుణపడి ఉంటాను. థాంక్యూ చెన్నై. మరోసారి ఎల్లో జెర్సీ ధరించడానికి ఆతృతగా ఉన్నా" అని జాదవ్ ట్వీట్ చేశాడు.
చెన్నై సూపర్ కింగ్స్:
విడుదల చేసిన ఆటగాళ్లు: మార్క్ వుడ్, కనిష్క్ సేథ్, శర్మ
రిటైన్ చేసుకున్న ఆటగాళ్లు: ధోని, డేవిడ్ విల్లీ, డ్వేన్ బ్రేవో, కేదార్ జాదవ్, అంబటి రాయుడు, సామ్ బిల్డింగ్స్, హర్భజన్ సింగ్, దీపక్ చహర్, ఆసిఫ్, లుంగీ ఎంగిడి, ఇమ్రాన్, సురేష్ రైనా, సురేష్ రైనా, ఫాఫ్ డు ప్లెసిస్, మురళీ విజయ్, షేన్ వాట్సన్, రవీంద్ర జడేజా, మిచెల్ సాన్నర్, తాహీర్, కర్ణ్ శర్మ, ధ్రువ్ షోర్రీ, ఎన్ జగదీసేన్, శార్తుల్ ఠాకూర్, మోను కుమార్, చైతన్య బిష్ణోయి.