
హైదరాబాద్: చెన్నైలోని చెపాక్ స్టేడియంలో మంగళవారం కోల్‌కతా నైట్ రైడర్స్-చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్ నిర్వహిస్తే స్టేడియంలోకి పాముల్ని వదులుతామని ప్రో-తమిళ్ పార్టీ తమిళగ వాళ్వురిమై కచ్చి (టీవీకే) హెచ్చరించింది. ఈ మేరకు టీవీకే చీఫ్ వేల్‌మురుగన్ సంచనల వ్యాఖ్యలు చేశారు.
టోర్నీలో భాగంగా రెండేళ్ల తర్వాత సొంతగడ్డపై అభిమానుల మధ్య చెన్నై సూపర్ కింగ్స్ తొలి మ్యాచ్ ఆడబోతోంది. అయితే ఈ మ్యాచ్‌కి కావేరి నదీ జలాల వివాదం అడ్డంకిగా మారింది. షెడ్యూల్ ప్రకారం చెన్నైలోని చెపాక్ స్టేడియంలో మంగళవారం రాత్రి 8 గంటలకు కోల్‌కతాతో చెన్నై జట్టు సొంత ప్రేక్షకుల మధ్య బరిలోకి దిగనుంది.
చెన్నైలో జరిగే ఐపీఎల్ మ్యాచ్‌లను అడ్డుకుంటామని తమిళనాడుకు చెందిన రాజకీయ పార్టీలు ఇప్పటికే ప్రకటనలు చేయడంతో స్టేడియంలో దాదాపు నాలుగువేల మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేశారు. సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో పాటు పలువురు రాజకీయ నేతలు ఐపీఎల్ మ్యాచ్‌లను బహిష్కరించాలని పిలుపునిచ్చారు.
అంతేకాదు కావేరీ మేనేజ్‌మెంట్ బోర్డు ఏర్పాటు కోసం తమిళనాడు ప్రజలు చేపట్టిన నిరసనకు చెన్నై సూపర్ కింగ్స్ మద్దతు ఇవ్వాలని కూడా రజనీకాంత్ డిమాండ్ చేశారు. చెన్నై సూపర్ కింగ్స్ జట్టులోని ఆటగాళ్లు నల్ల బ్యాడ్జిలు ధరించి ఈ నిరసనకు మద్దతు తెలపాలని ఆయన సూచించారు.
ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం నుంచే చెపాక్ స్టేడియం బయట ఆందోళనలు మొదలయ్యాయి. స్టేడియంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇప్పటికే చెన్నై పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. 1000 రోజుల తర్వాత చెన్నైలో ఐపీఎల్ మ్యాచ్ జరుగుతుండటంతో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.
రాత్రి 8 గంటలకు ప్రారంభమయ్యే చెన్నై, కోల్‌కతా మ్యాచ్‌కు నల్లదుస్తులు వేసుకొస్తే మ్యాచ్‌కి అనుమతించేది లేదని బీసీసీఐ ఇప్పటికే స్పష్టం చేసింది. మరోవైపు చెపాక్ స్టేడియంలో కోల్‌కతాతో జరిగే మ్యాచ్‌కు మొబైల్ ఫోన్స్‌ను అనుమతిస్తున్నట్లు చెన్నై సూపర్ కింగ్స్ తన ట్విట్టర్‌లో పేర్కొంది. అలాగే చెన్నైలోని మ్యాచ్‌లన్నీ షెడ్యూల్ ప్రకారం జరుగుతాయని, వాటిలో ఎలాంటి మార్పు ఉండదని చెన్నై సూపర్ కింగ్స్ సీఈఓ స్పష్టం చేశారు.