
హైదరాబాద్: మైదానంలో ఉంటే మెరుపులు, స్టేడియంలో ఉంటే అరుపులు, డ్రెస్సింగ్ రూమ్‌లో నవ్వులు.. ఇవన్నీ వెస్టిండీస్ ఆల్ రౌండర్ డేన్ బ్రావో గురించే. అంతర్జాతీయ క్రికెట్‌లో బ్రావో తెలిసిన వారందరికీ అతనిలోని ఎంటర్‌టైన్‌మెంట్ యాంగిల్ కూడా తెలిసే ఉంటది. వికెట్ తీసినా.. క్యాచ్ పట్టినా అతను చేసుకున్న సెలబ్రేషన్ వేరేలా ఉంటుంది. ఇటీవలే మే27న వాంఖడే వేదికగా ఐపీఎల్ సమరం ముగిసింది. ఈ ఫైనల్ పోరులో చెన్నై 8 వికెట్ల తేడాతో గెలుపొందడంతో చెన్నై ఆటగాళ్లతో పాటు జట్టు అభిమానుల ఆనందానికి అవధుల్లేవ్.
ఈ నేపథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్‌ను ఉద్దేశించి డేన్ బ్రావో.. ఓ పాటను రాసి పాడాడు. దాన్ని తన అధికారిక ట్విట్టర్ ద్వారా డేన్ బ్రావో .. ట్విట్టర్ ద్వారా రిలీజ్ చేయడంతో అభిమానులకు అదేదో సూపర్ కింగ్స్ నినాదం అనే స్థాయిలో వింటున్నారు. 2 నిమిషాల 45 సెకన్ల నిడివితో ఉన్న ఈ పాట 'వి ఆర్ ద కింగ్స్... వి ఆర్ ద కింగ్స్. చెన్నై సూపర్ కింగ్స్' అంటూ మొదలవుతోంది. పాటలో ఆసాంతం ఈ సీజన్‌లో చెన్నై ఆటగాళ్లు ఆడిన హైలెట్స్‌ను చూపిస్తూ.. దానికి అనుగుణంగా గొంతు కదిపాడు.
ఫైనల్ మ్యాచ్‌లో చెన్నై జట్టు కేన్ విలియమ్‌సన్ కెప్టెన్సీ వహిస్తున్న సన్‌రైజర్స్‌ను ఓడించింది. ఈ సీజన్‌లో డేన్ బ్రావో.. 35.25 యావరేజితో 141 పరుగులు చేశాడు. బౌలింగ్‌లో 14 వికెట్లు తీయగలిగాడు. బ్రావో పేరు మీద టీ20ల్లో 400 వికెట్లు తీసిన రికార్డు కూడా లిఖితమై ఉంది. ప్రస్తుతం ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తరపు ఆడుతున్న బ్రావో.. బిగ్ బాష్ లీగ్‌లో మెల్‌బౌర్న్ రెనెగేడ్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు.
వెస్టిండీస్ జాతీయ జట్టు తరపున టెస్టు క్రికెట్‌లో ఏడేళ్ల నుంచి ఆడట్లేదు. వన్డే క్రికెట్‌లో 2014 నుంచి దూరంగానే ఉన్నాడు.