
హైదరాబాద్: ఐపీఎల్ 11వ సీజన్‌లో ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తోన్న జస్ప్రీత్ బుమ్రా మరోసారి అభిమానుల ఆగ్రహానికి గురయ్యాడు. టోర్నీలో భాగంగా ఆదివారం రాజస్థాన్ రాయల్స్-ముంబై ఇండియన్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది.
ఈ మ్యాచ్‌లో 19వ ఓవర్‌లో బుమ్రా వేసిన నో బాల్ మ్యాచ్ ఫలితాన్ని మార్చేసింది. అప్పటివరకూ ముంబై చేతిలో ఉన్న మ్యాచ్ ఈ నోబాల్‌తో ఒక్కసారిగా మారిపోయింది. ఫలితంగా రాజస్థాన్ రాయల్స్ ఈ మ్యాచ్‌లో మూడు వికెట్ల తేడాతో విజయం సాధించింది.
ఆఖరి మూడు ఓవర్లలో రాజస్థాన్ విజయం సాధించేందుకు గాను 44 పరుగులు కావాల్సి ఉండగా.. గౌతమ్ కృష్ణప్ప మెరుపు ఇన్నింగ్స్‌తో రాజస్థాన్ విజయంలో కీలకపాత్ర పోషించాడు. 12 బంతుల్లో 28 పరుగులు అవసరం ఉన్న సమయంలో బుమ్రా ఒకే ఓవర్‌లో 18 పరుగులు సమర్పించుకున్నాడు.
దీంతో సోషల్ మీడియాలో వేదికగా ముంబై అభిమానులు బుమ్రాపై సెటైర్లు వేస్తున్నారు. అయితే, బుమ్రా నోబాల్ వేసి జట్టును ఓడిపోయేలా చేయడం ఇది మొదటిసారి కాదు. గతేడాది జరిగిన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో బుమ్రా వేసిన నో బాల్ పాక్ విజయానికి కారణమైంది.