
హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ముంబై ఇండియన్స్ ఫ్రాంఛైజీ రూ. 17 కోట్లకి కెప్టెన్ రోహిత్ శర్మని మొదటి ప్రాధాన్య ఆటగాడిగా అట్టిపెట్టుకోవాలని నిర్ణయం తీసుకుంది. అయితే, రోహిత్ శర్మనే స్వయంగా ఫ్రాంఛైజీతో మాట్లాడి రూ. 15 కోట్లకే తన ధరని తగ్గించుకుని మరో ఇద్దరు ఆటగాళ్లను జట్టులోకి తీసుకోమని సలహా ఇచ్చాడంట.
ఐపీఎల్ 2018 సీజన్‌కి తాము అట్టిపెట్టుకునే ఆటగాళ్ల వివరాలను టోర్నీలోని ఎనిమిది ఫ్రాంఛైజీలు గురువారం రాత్రి ఐపీఎల్ నిర్వాహుకులకు అందచేసిన సంగతి తెలిసిందే. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంఛైజీ అత్యధికంగా రూ. 17 కోట్లకి విరాట్ కోహ్లిని అట్టిపెట్టుకుంది. దీంతో ఐపీఎల్లో అత్యధిక ధర పలికిన ఆటగాడిగా కోహ్లీ చరిత్ర సృష్టించాడు.
మరోవైపు చెన్నై సూపర్ కింగ్స్.. మహేంద్రసింగ్ ధోనీని, ముంబయి ఇండియన్స్ రోహిత్ శర్మని రూ.15 కోట్ల చొప్పున అట్టిపెట్టుకున్నాయి. కోహ్లి తర్వాత వీరే అత్యధిక ధర పలికిన ఆటగాళ్లు. 'రోహిత్ శర్మ ఓ నాయకుడు. మైదానంలోనే కాదు.. వెలుపల కూడా అతను లీడర్ అని నిరూపించాడు. జట్టులో సమతూకం తెచ్చేందుకు ఓపెనర్‌గా ఉన్న రోహిత్ బ్యాటింగ్ స్థానాన్ని మూడుకి మార్చాం. అతను అర్థం చేసుకుని చక్కగా ఒదిగిపోయాడు. తాజాగా నిస్వార్థంతో ముంబయి ఇండియన్స్ జట్టు బలంగా ఉండాలంటూ భారీ మొత్తాన్ని వదులుకున్నాడు' అని ముంబై ఇండియన్ ఫ్రాంఛైజీ వర్గాలు తెలిపాయి.
రూ.15 కోట్లకి తన ధరని తగ్గించుకోవడం ద్వారా.. ప్లేయర్ రిటెన్షన్ ప్రాసెస్లో ఇద్దరు టాప్ క్రికెటర్లను చేజిక్కించుకునే అవకాశం ముంబైకి లభించింది. నిజానికి అట్టిపెట్టుకునే పద్ధతిలో ముగ్గురు ఆటగాళ్లని ఫ్రాంఛైజీ ఎంచుకుంటే.. రూ.33 కోట్లు కోత పడుతుంది. ఇక్కడ ముంబై ఇండియన్స్ ఈ పద్ధతి ద్వారా రోహిత్ శర్మ (రూ.15 కోట్లు), హార్దిక్ పాండ్య (రూ.11 కోట్లు), జస్‌ప్రీత్ బుమ్రా (రూ.7కోట్లు)లను ఎంచుకుంది.
అట్టిపెట్టుకునే విధానంలో రూ.33 కోట్లకి మించి ఏ ఫ్రాంఛైజీ ఖర్చు చేయకూడదనేని నిబంధన ఉంది. ఇలా చూస్తే.. ఒకవేళ రోహిత్ శర్మకి మరో రెండు కోట్లు ఎక్కువ ఇవ్వాల్సి వచ్చింటే.. బుమ్రాని అట్టిపెట్టుకునే అవకాశం ముంబై కోల్పోయి ఉండేది. అతడి స్ధానంలో మరో ఆటగాడిని తీసుకోవాల్సి వచ్చేది.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.