ఎందుకీ నిర్ణయం!: పేరు, వేదిక మార్చుకోనున్న రాజస్థాన్, పంజాబ్ జట్లు
హైదరాబాద్: 2013 ఐపీఎల్‌లో చోటు చేసుకున్న స్పాట్ ఫిక్సింగ్ కుంభకోణం వల్ల రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లపై రెండేళ్ల నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఇటీవలే నిషేధం పూర్తవడంతో ఈ రెండు జట్లు 2018 ఐపీఎల్ సీజన్‌లో తిరిగి పునరాగమనం చేయనున్నాయి.
ఈ క్రమంలో రాజస్ధాన్ రాయల్స్ జట్టు పేరుతో పాటు జట్టు అధికారిక వేదికను కూడా మార్చుకోవాలని భావిస్తోంది. తమ ఫ్రాంఛైజీని నడిపించే 'జైపూర్ ఐపీఎల్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ' పేరును, అలాగే 'రాజస్థాన్ రాయల్స్' జట్టు పేరును మార్చుకోవడానికి తమకు అనుమతి ఇవ్వాలని బీసీసీఐకి లేఖ రాసింది.

స్పాట్ ఫిక్సింగ్ కుంభకోణం వల్లే
స్పాట్ ఫిక్సింగ్ కుంభకోణంలో జట్టు పరువు ప్రతిష్టలు మంటగలిశాయని భావించిన యాజమాన్యం, పేరు మార్పుతో పాటు జైపూర్ నుంచి ఫ్రాంఛైజీ కేంద్రాన్ని తరలించి మరో చోటికి వెళ్లాలని.. మొత్తంగా ఓ కొత్త ఫ్రాంఛైజీ లాగా 2018 ఐపీఎల్ సీజన్‌లోకి అడుగుపెట్టాలని యాజమాన్యం భావిస్తోంది.

మొహాలీ నుంచి ఇండోర్‌కు
మరోవైపు కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు తమ అధికారిక వేదిక మొహాలీ నుంచి ఇండోర్‌కు మారాలని నిర్ణయించింది. ఈ మేరకు బీసీసీఐకి పంజాబ్ యాజమాన్యం లేఖ రాసింది. పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ నుంచి మ్యాచ్‌ల సమయంలో తమకు సహకారం అందడం లేదని, మ్యాచ్‌ల సమయంలో టికెట్ల అమ్మకాల ద్వారా ఆదాయం రావడం లేదని యాజమాన్యం అంటోంది.

మొహాలితో పోలిస్తే ఇండోర్‌లో ఎక్కువ ఆదాయం
గత సీజన్లలో కొన్ని మ్యాచ్‌లను ఇండోర్ వేదికగా నిర్వహించగా, మొహాలిలో జరిగిన మ్యాచ్‌లతో పోలిస్తే అక్కడే ఎక్కువ ఆదాయం వచ్చింది. అంతేకాదు ఇండోక్ క్రికెట్ అసోసియేషన్ నుంచి ప్రాంఛైజీకి చక్కటి సహకారం లభించడంతో పాటు అభిమానుల మద్దతు కలిసి రావడంతో పంజాబ్ ప్రాంఛైజీ ఈ నిర్ణయం తీసుకుంది.

ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్‌లో ప్రస్తావనకు రానున్న లేఖలు
మొహాలిని వీడి ఇండోర్‌కు చేరితే ప్రాంఛైజీల పేర్లు కూడా మారతాయి. అయితే ఫ్రాంఛైజీ పేరుతో పాటు వేదిక మార్పు కోసం బీసీసీఐకి ఈ రెండు ఫ్రాంఛైజీలు అదనంగా ఫీజు కట్టాల్సి ఉంటుందని తెలుస్తోంది. ఈ రెండు ప్రాంఛైజీలు రాసిన లేఖలను బీసీసీఐ పాలకుల కమిటీ (సీఓఏ) పరిశీలించి ఆ తర్వాత ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో ఈ అంశాన్ని ప్రస్తావించనుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications