
హైదరాబాద్: టీమిండియా మాజీ క్రికెటర్ సాయిరాజ్ బహుతులెని రాజస్థాన్ రాయల్స్ జట్టు స్పిన్ బౌలింగ్ కోచ్‌గా నియమించుకుంది. ఈ మేరకు మంగళవారం రాజస్థాన్ రాయల్స్ ప్రాంఛైజీ అధికారిక ప్రకటన చేసింది.
'రాజస్థాన్ రాయల్స్ కోచింగ్ స్టాప్ మరింత పటిష్టం అయ్యేందుకు గాను స్పిన్ బౌలింగ్ కోచ్‌గా సాయిరాజ్ బహుతులెని నియమించుకుంది. ముంబైలోని క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియాలో సాయిరాజ్ బహుతులె నేతృత్వంలో జట్టుకు రెండో క్యాంప్ నిర్వహించారు. జట్టులోని స్పిన్ బౌలింగ్ బౌలర్లకు కొన్ని మెలకువలు నేర్పించారు' అని ఫ్రాంచైజీ ప్రకటనలో పేర్కొంది.
ప్రస్తుతం రాజస్థాన్ రాయల్స్ జట్టు సపోర్టింగ్ స్టాఫ్‌కు జుబిన్ బారుచా సారథ్యం వహిస్తున్నారు. 118 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లాడిన సాయిరాజ్ బహుతులె 26 సగటుతో 630 వికెట్లు తీశాడు. ఇక బ్యాటింగ్ విషయానికి వస్తే 31.83 సగటుతో 6,176 పరుగులు సాధించాడు. ఇందులో తొమ్మిది సెంచరీలు ఉన్నాయి.
ఫస్ట్ క్లాస్ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన తర్వాత సాయిరాజ్ బహుతులె అనేక రాష్ట్ర స్థాయి జట్లకు కోచింగ్ ఇచ్చారు. రంజీ క్రికెట్‌లో గత మూడు సీజన్లుగా పంజాబ్ జట్టు కోచ్‌గా ఉన్నారు. తాను కోచింగ్ ఇచ్చిన సమయంలో కోల్‌కతా జట్టు రంజీ క్రికెట్లో క్వార్టర్ ఫైనల్స్‌తో పాటు సెమీ ఫైనల్స్ వరకు వెళ్లింది.
రాజస్థాన్ రాయల్స్ జట్టు బౌలింగ్ కోచ్‌గా ఎంపిక అవడంపై సాయిరాజ్ బహుతులె మాట్లాడుతూ 'రాజస్థాన్ రాయల్స్ కోచింగ్ స్టాఫ్‌లో సభ్యుడిగా చేరడం సంతోషంగా ఉంది. లెజెండరీ షేన్ వార్న్ మెంటార్‌గా ఉన్న జట్టులో భాగస్వామి కావడంతో చాలా ఆతృతగా ఉన్నా. నా నాలెడ్జిని ఆటగాళ్లతో పంచుకోవడం కోసం ఆతృతగా ఉన్నా' అని పేర్కొన్నాడు.