ఈడెన్‌లో KKR v SRH Qualifier 2: రెండో ఫైనల్ బెర్త్ ఎవరిదో?

హైదరాబాద్: ఐపీఎల్-11లో మరో కీలక పోరుకు సమయం ఆసన్నమైంది. రెండో ఫైనల్ బెర్త్ ఎవరిదో తేల్చుకునేందుకు శుక్రవారం కోల్‌కతా నైట్‌రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు పోటీ పడనున్నాయి. ఈ మ్యాచ్‌కి కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ ఆతిథ్యమిస్తోంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఆదివారం చెన్నై సూపర్ కింగ్స్‌తో ఫైనల్లో తలపడనుంది.
ఈ మ్యాచ్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. లీగ్ దశలో తమను ఓడించిన కోల్‌కతాపై ప్రతీకారం తీర్చుకోవడంతో పాటు ఫైనల్ బెర్త్‌ను ఖాయం చేసుకోవాలని విలియమ్సన్ బృందం ఎదురుచూస్తుంటే.. మూడో టైటిల్‌తో చరిత్రను తిరుగరాయాలని కోల్‌కతా నైట్‌రైడర్స్ ఉవ్విళ్లూరుతోంది. ఈడెన్‌లో మ్యాచ్ జరుగుతుండటంతో కోల్‌కతా ఫేవరేట్‌గా బరిలోకి దిగుతుంది.

చివరి ఐదు మ్యాచ్‌ల్లో నాలుగు పరాజయాలు
చివరి ఐదు మ్యాచ్‌ల్లో నాలుగు పరాజయాలు. ప్రస్తుతం సన్‌రైజర్స్ హైదరాబాద్ పరిస్థితి ఇది. లీగ్ ప్రారంభ దశలో పటిష్టంగా కనిపించిన జట్టు చివరిక వచ్చే సరికి వరుస పరాజయాలను చవిచూసింది. ఈ సీజన్‌లో హైదరాబాద్ విజయాలకు వెన్నెముకగా నిలిచింది బౌలర్లే. దీంతో ఈ మ్యాచ్‌లో కూడా బౌలింగ్‌పైనే రైజర్స్ ఎక్కువగా ఆధారపడి ఉంది. అయితే క్వాలిఫయర్-1లో డెత్ ఓవర్లలో కెప్టెన్ విలియమ్సన్ వ్యూహాత్మక తప్పిదాల వల్ల అనవసరంగా మ్యాచ్‌ను కోల్పోయారు. దీంతో ఈసారి అలాంటి తప్పిదాలు జరుగకుండా మేనేజ్‌మెంట్ పక్కా ప్రణాళికలు సిద్ధం చేసింది.

హైదరాబాద్‌కు బౌలింగే బలం
లీగ్ దశ నుంచి అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు నమోదు చేసిన భువనేశ్వర్ (9 వికెట్లు), సిద్ధార్థ్ కౌల్ (19 వికెట్లు), సందీప్ నిలకడగా బౌలింగ్ చేస్తుండటం హైదరాబాద్‌కు కలిసొచ్చే అంశం. పేసర్లకు తోడు సూపర్ టాలెంట్ స్పిన్నర్ రషీద్ ఖాన్ (18 వికెట్లు), ఆల్‌రౌండర్ షకీబ్ అత్యంత కీలకంకానున్నారు. ఇక, బ్యాటింగ్ విషయానికి వస్తే గత మ్యాచ్‌లో డకౌట్ అయిన శిఖర్ ధావన్ (437 పరుగులు)పై భారీ అంచనాలున్నాయి.

ధావన్ రాణించాల్సిన సమయం వచ్చింది
ధావన్‌తో పాటు కేన్ విలియమ్సన్ రాణిస్తే తిరుగుండదు. మిడిలార్డర్ వైఫల్యం హైదరాబాద్‌ను ఇబ్బందులకు గురి చేస్తోంది. మనీష్ పాండే (284), యూసుఫ్ పఠాన్ (212) వైఫల్యం ఆందోళన కలిగిస్తున్నది. కాబట్టి ఈ మ్యాచ్‌లో మనీశ్ పాండే, యూసుఫ్ పఠాన్ దూకుడుగా ఆడితే హైదరాబాద్ భారీ స్కోరు చేయడం సాధ్యమవుతుంది. మరోవైపు మొదటి నుంచి అండగా ఉన్న సన్‌రైజర్స్ బౌలర్లు మరింత కట్టుదిట్టం అయితే ప్రత్యర్థిని తక్కువ స్కోరుకే పరిమితం చేసి పైచేయి సాధించవచ్చు.

సమిష్టిగా అద్భుత ప్రదర్శన చేస్తోన్న కోల్‌కతా
స్టార్ క్రికెటర్లు లేకపోయినా... సమిష్టిగా కోల్‌కతా ఈ సీజన్‌లో అద్భుత విజయాలను నమోదు చేస్తోంది. గత ఐదు మ్యాచ్‌ల్లో నాలుగింట్లో అలానే విజయం సాధించింది. ఎలిమినేటర్‌లోనూ సమిష్టిగా రాణించి చేజారిన మ్యాచ్‌ను చేజిక్కించుకుంది. ఇప్పుడు క్వాలిఫయర్-2కు కూడా కార్తీక్ ఇదే జట్టుతో అదే వ్యూహాలను అమలు చేయబోతున్నాడు. క్వాలిఫయిర్-2 మ్యాచ్ సొంత మైదానంలో జరుగుతుండటంతో ఆ జట్టుకు అదనపు బలం. కోల్‌కతా బ్యాటింగ్ లైనప్ బలంగా ఉంది. టాపార్డర్‌లో నరైన్, క్రిస్‌లిన్ భారీ హిట్టింగ్ చేయగలరు. మిడిలార్డర్‌లో ఉతప్ప, రానా, కార్తీక్ స్కోరు బోర్డును పరిగెత్తించగలరు.

కోల్‌కతా మిడిలార్డర్ ఎంతో కీలకం
యువ క్రికెటర్ శుబ్‌మన్ గిల్ ఫర్వాలేదనిస్తున్నాడు. ఇక, బౌలింగ్‌లో ఎలాంటి బ్యాట్స్‌మన్‌నైనా ముప్పుతిప్పలు పెట్టే స్పిన్ త్రయం నరైన్, చావ్లా, కుల్దీప్ అందుబాటులో ఉన్నారు. మ్యాచ్ మిడిల్ ఓవర్లలో వీళ్లు పరుగులు నిరోధించడంతో పాటు వికెట్లు తీసి ప్రత్యర్థులపై ఒత్తిడి పెంచుతున్నారు. ఈ సీజన్‌లో కోల్‌కతా జట్టుకు లభించిన ఆణిముత్యం పేసర్ ప్రసిద్ధ్ కృష్ణ. స్లాగ్ ఓవర్లలో అద్భుత ప్రదర్శన చేస్తున్నాడు. మొత్తంగా చూస్తే కోల్‌కతా నైట్‌రైడర్స్ సమతుల్యంతో ఉంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications