
హైదరాబాద్: ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ అంటే ఓ పండుగే. క్రీడాకారుల ఎంపిక దగ్గర్నుంచి, వేలం, టాస్ గెలవడం, మ్యాచ్ గెలుపోటములు అన్నీ ఆసక్తికరంగా సాగే అంశాలే. అయితే ఇప్పటికే ఐపీఎల్ ఆడబోయే క్రీడాకారల పేర్లను కొంతవరకు ఆయా జట్టు యాజమాన్యం విడుదల చేసినప్పటికీ మిగిలిన తంతు జనవరి 27, 28తేదీల్లో జరగనుంది. ఈ వేలంలో ఒకవేళ నువ్వు (జో రూట్) ఎంపికైనా ఆడటానికి వీల్లేదంటూ తెగేసి చెప్తున్నాడు ఇంగ్లాండ్ కోచ్ ట్రీవర్ బేలీస్.
ఐపీఎల్‌లో ఆడేందుకు అవకాశం వస్తే ఏ ఆటగాడు మాత్రం వదులుకుంటాడు. కానీ, ఇంగ్లాండ్ సారథి జో రూట్‌ను ఐపీఎల్ ఆడొద్దని సూచించాడు ఆ జట్టు కోచ్ ట్రీవర్ బేలిస్. రూట్ ఇప్పటి వరకు ఐపీఎల్‌లో ఆడలేదు. ఆ దేశ ఆటగాళ్లు బెన్ స్టోక్స్, జాసన్ రాయ్, తైమల్ మిల్స్ గత ఏడాదే ఐపీఎల్‌లో రంగప్రవేశం చేశారు. ఈ ఏడాది ఐపీఎల్ వేలానికి రూట్ అందుబాటులో ఉండాలని భావిస్తున్నట్లు సమాచారం.

మరోపక్క స్టోక్స్ ఐపీఎల్ ఆడొచ్చని ఇంగ్లాండ్, వేల్స్ బోర్డు ఇటీవల ప్రకటన జారీ చేసిన సంగతి తెలిసిందే. యాషెస్ సిరీస్‌లో రూట్ చేతి వేలికి గాయమైంది. 2018లో ఇంగ్లాండ్‌కు బిజీ షెడ్యూల్ ఉంది. ఈ కారణంగానే అతడిని ఐపీఎల్ ఆడొద్దంటూ ఇంగ్లాండ్ జట్టు ప్రధాన కోచ్ ట్రేవరీ బేలిస్ సూచిస్తున్నాడట.
' కొద్ది రోజుల క్రితం మా ఇద్దరి మధ్య ఐపీఎల్ గురించి చర్చ జరిగింది. నేను ఆడొద్దనే సలహా ఇచ్చాను. తదుపరి టోర్నీల్లో రాణించాలంటే విశ్రాంతి అవసరమని చెప్పాను. రెండేళ్ల నుంచి ఎక్కువ క్రికెట్ ఆడుతున్నాడు. వచ్చే ఏడాది వన్డే ప్రపంచకప్ ఉంది. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకునే చెప్పాను. ఫిబ్రవరి, మార్చిలో ఇంగ్లాండ్.. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌తో పరిమిత ఓవర్ల క్రికెట్ ఆడనుంది. ఆ తర్వాత వేసవిలో పాకిస్థాన్, భారత్‌తో సిరీస్‌లు ఆడనుంది. ఈ ఏడాది మా క్యాలెండర్ క్రికెట్ షెడ్యూల్స్‌తో బిజీగా ఉంది' అని బేలిస్ తెలిపాడు.
ఈ నెల 27, 28 తేదీల్లో బెంగళూరులో ఐపీఎల్-11వ సీజన్ కోసం ఆటగాళ్ల వేలం జరగనుంది. కోచ్ సూచన మేరకు రూట్ ఐపీఎల్‌ను వదులుకుంటాడో లేక ఆడతాడో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడక తప్పదు.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.