
హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు ఆల్‌రౌండర్లు హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యాను తన వద్దే అట్టిపెట్టుకుంది. ఐపీఎల్ 2018 సీజన్ కోసం జనవరి 27, 28 తేదీల్లో బెంగళూరులో నిర్వాహకులు వేలం నిర్వహించనున్నారు.
ఈ వేలానికి ముందు ఫ్రాంచైజీలు ముగ్గురు ఆటగాళ్లను తమ వద్దే అట్టిపెట్టుకునే వెసులుబాటుని ఐపీఎల్ నిర్వాహకులు కల్పించిన సంగతి తెలిసిందే. ఇందుకు గాను జనవరి 4ని చివరి తేదీగా నిర్ణయించింది. దీంతో ముంబై ఇండియన్స్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు పాండ్యా బ్రదర్స్‌ను తన వద్దే అట్టిపెట్టుకుంది.
రిటెన్షన్ పాలసీలో భాగంగా ఈ ముగ్గురిని ఎంపిక చేసుకుంది. ఇక, రైట్ టు మ్యాచ్ కింద జస్ప్రీత్ బుమ్రా, పొల్లార్డ్‌ను ముంబై మళ్లీ జట్టులోకి తీసుకునే అవకాశముంది. గతేడాది కృనాల్ పాండ్యా ముంబై విజయాల్లో కీలకపాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ముంబై ఎంచుకున్న ఈ ఐదుగురు ఆటగాళ్లు కూడా ప్రధాన ఆటగాళ్లు కావడం విశేషం.
ఇదిలా ఉంటే ఎంతమందిని అట్టిపెట్టుకోవాలనే దానిపై ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టు కాస్త అయోమయంలో ఉన్నట్లు తెలిసింది. రిషబ్‌పంత్, శ్రేయాస్ అయ్యర్‌లను ఢిల్లీ తిరిగి తీసుకునే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆటగాళ్లను అట్టిపెట్టుకునేందుకు జనవరి 4 చివరి తేదీగా ప్రకటించిన సంగతి తెలిసిందే.
రైజింగ్ పూణె సూపర్ జెయింట్ జట్టుకు రెండేళ్ల పాటు ఆడిన ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్‌ను ఈ సీజన్‌తో టోర్నీలోకి పునరాగమనం చేసిన రాజస్ధాన్ రాయల్స్ అట్టిపెట్టుకునే ఛాన్స్ ఉంది. ఇక, చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని, ఐపీఎల్ సూపర్ స్టార్ సురేశ్ రైనా, ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాను అట్టిపెట్టుకుంది.