
హైదరాబాద్: ఐపీఎల్ 11లో భాగంగా బెంగళూరు, చెన్నై జట్టు తలపడిన మ్యాచ్ కోహ్లీ వర్సెస్ ధోనీ అనే రీతిలో మారిపోయింది. మ్యాచ్‌కు ధోనీ సతీమణి సాక్షితో పాటుగా అనుష్క శర్మ కూడా రావడంతో మీడియా కన్నులు దాదాపు మ్యాచ్ ముగిసేంత వరకూ వాళ్లనే చూస్తూ ఉండిపోయాయి. ముందుగా బ్యాటింగ్ చేసిన బెంగళూరు జట్టులో కోహ్లీ పెద్దగా రాణించకపోయినా అతని జట్టులో డివిలియర్స్, డికాక్ చెన్నైకు దాదాపు భారీ టార్గెట్‌నే ఇచ్చారు.
అనంతరం ఛేదనకు దిగిన ధోనీ సేన సిక్సుల వర్షం కురిపించి విజయాన్ని కైవసం చేసుకుంది. కేవలం 34 బంతుల్లో 70 పరుగుల స్కోరు చేసిన చెన్నై కెప్టెన్ చిన్నస్వామి స్టేడియంలో మెరుపులు చూపించాడు. ధోనీ బ్యాటింగ్ చేస్తున్నంత సేపు అతని భార్య సాక్షి మంచి ఉత్సాహంగా కనిపించారు. ప్రత్యర్థి జట్టకు పరుగులు వెళ్లిపోతున్నాయని అనుష్క ఆశ్చర్యాన్ని ప్రదర్శిస్తూ పలికించిన హావభావాలు ప్రేక్షకులను అలరించాయి.
ధోనీ సిక్సు కొట్టిన ప్రతీసారి సాక్షి స్టేడియంలో పక్కను కూర్చొన్న వాళ్లకు హై ఫై ఇస్తూ సందడి చేసింది. 18వ ఓవర్‌లో మొహమ్మద్ సిరాజ్ వేసిన బంతి సిక్సు బాదాడు ధోనీ. దానికి స్పందించిన సాక్షి వన్ మోర్ సిక్స్ అంటూ స్టేడియంలోంచి కేరింతలు కొడుతూ చెన్నై జట్టును ఉత్సాహపరిచింది. ఇదిలా ఉంటే ఒక్కో పరుగు తీస్తున్నప్పుడు అనుష్క శర్మ నిరుత్సాహానికి గురౌతున్నట్లు ఎక్స్‌ప్రెషన్స్ ఇస్తూ వచ్చింది.
అనుష్క శర్మ, సాక్షి వీరితో పాటుగా సురేశ్ రైనా భార్య ప్రియాంక, ఇమ్రాన్ తాహిర్ భార్య సుమయ్య కూడా హాజరైయ్యారు. ఈ మ్యాచ్‌లలో ధోనీ ఏడు సిక్సులతో చెలరేగాడు. అంబటి రాయుడు కూడా అతనికి తోడై 53బంతుల్లో 83పరుగులు జోడించి చెన్నై విజయంలో కీలక పాత్ర వహించాడు.