
హైదరాబాద్: జట్టు విజయం కోసం పరితపించాడు. ఓపెనర్‌గా దిగి చివరి ఓవర్ ముందు అవుట్ అయ్యాడు. అవుట్ అయ్యేంత వరకూ ఒకటే ధ్యాస మ్యాచ్ ఎలాగైనా గెలిచి తీరాల్సిందే. ఈ క్రమంలో వరుసగా వికెట్లు చేజారుతున్నా క్రీజులో స్థిరపడిపోయాడు. 18.3 ఓవర్‌లో బుమ్రా వేసిన బంతి అతని ఆశలను నీరుగార్చాయి. దీంతో పెవిలియన్ కు చేరుకుని తర్వాత క్రీజులోకి వచ్చిన వాళ్లైనా జట్టును గెలిపించాలనుకుంటూ కోరుకుంటుండగా జట్టు ఓటమిపాలవక తప్పలేదు.
విజయం కోసం ఆరాటపడి ఆ పోరాటంలోనే వికెట్ చేజార్చుకున్న కేఎల్ రాహుల్ ఒక్కసారిగా పరాజయాన్ని తట్టుకోలేకపోయాడు. కొంతసేపటి వరకూ భావోద్వేగానికి గురైయ్యాడు. అతని వేదన ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లను సైతం కదలించింది. విజయానందంలో ఉన్న ముంబై జట్టు ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యా క్రీడా స్ఫూర్తిని చాటుతూ ముందుకొచ్చాడు. తన జెర్సీని తీసి రాహుల్‌కు ఇచ్చాడు దీంతొ ఒకరికొకరు జెర్సీలు మార్చుకుని క్రీడాస్ఫూర్తిని చాటారు.
ఈ సన్నివేశాన్ని హార్దిక్ పాండ్యా తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. ఆ వీడియోను పోస్టు చేస్తూ.. 'సూపర్ ప్లేయర్... సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు..' అంటూ కితాబిచ్చాడు. ఈ పోస్టుపై స్పందించిన అభిమానులు మంచి ఇన్నింగ్స్‌తో అలరించిన రాహుల్‌ను, అంతా ఒకటే అనే భావన కలుగజేసిన పాండ్యాపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
వాంఖడే వేదికగా ముంబై ఇండియన్స్‌తో తలపడ్డ పంజాబ్ కేవలం మూడు పరుగుల తేడాతో ఓటమికి గురైంది. దీంతో లీగ్ పాయింట్ల పట్టికలో ముంబై జట్టు నాలుగో స్థానానికి ఎగబాకింది. ఈ మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ అదిరిపోయే ఇన్నింగ్స్ ఆడి 60బంతుల్లో 94పరుగులు చేశాడు.