ఐపీఎల్‌లో హైదరాబాద్ బోణీ: చెలరేగిన ధావన్, రాజస్థాన్‌పై అలవోక విజయం

Posted By:
IPL 2018: Sunrises Hyderabad Beat Rajasthan By 9 Wickets In Low Scoring Match
SRH

హైదరాబాద్: ఐపీఎల్ 11వ సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ శుభారంభం చేసింది. సోమవారం ఉప్పల్ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 126 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు 15 ఓవర్లకే లక్ష్యాన్ని ఛేదించింది.

ఆదిలోనే సాహా వికెట్ కోల్పోయినప్పటికీ.. సన్ రైజర్స్ ఓపెనర్ శిఖర్ ధావన్ 57 బంతుల్లో ఒక సిక్సర్, 13 ఫోర్లతో 77 పరుగులు చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. కెప్టెన్ విలియమ్సన్ 35 బంతుల్లో ఒక సిక్సర్, 3 ఫోర్లతో 36 పరుగులు చేశాడు. వీరిద్దరూ కలిసి తొలి వికెట్‌కు 121 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.

స్లిప్‌లో రహానే క్యాచ్ జారవిడవడంతో ఖాతా తెరవకుండానే ఔటయ్యే ప్రమాదం నుంచి బయటపడిన ధావన్.. రాజస్థాన్ బౌలర్లతో ఆటాడుకున్నాడు. బౌండరీల మోత మోగిస్తూ.. మెరుపు వేగంతో పరుగులు రాబట్టాడు. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 125 పరుగులు చేసింది.

ధావన్ దూకుడు... విజయం దిశగా సన్‌రైజర్స్

ఉప్పల్ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ విజయం వైపు దూసుకుపోతోంది. 126 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్ 13 ఓవర్లకు 114 పరుగులు సాధించింది. ఓపెనర్ సాహా ఐదు పరుగులు చేసి ఔటయ్యాడు. శిఖర్ ధావన్ 70, కెప్టెన్ విలియమ్సన్ 30 పరుగులతోనూ క్రీజులో ఉన్నారు.

తొలి వికెట్ కోల్పోయిన సన్‌రైజర్స్
ఉప్పల్ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ తొలి వికెట్ కోల్పోయింది. 126 పరుగుల లక్ష్యాన్ని చేధించే క్రమంలో సన్‌రైజర్స్ తొలి వికెట్ కోల్పోయింది. ఉనాద్కత్ వేసిన రెండో ఓవర్‌ మూడో బంతిని భారీ షాట్ కొట్టేందుకు ప్రయత్నించి సాహా(5) పెవిలియన్ చేరాడు. దీంతో సన్‌రైజర్స్ మూడు ఓవర్లు ముగిసేసరికి 1 వికెట్ నష్టానికి 24 పరుగులు చేసింది. ప్రస్తుతం ధావన్(17), విలియమ్‌సన్ పరుగులేమీ చేయకుండా క్రీజులో ఉన్నారు.

IPL 2018: Match 4: Sunrisers Hyderabad win the toss and elect to field

సన్‌రైజర్స్ విజయ లక్ష్యం 126
ఐపీఎల్ 2018 సీజన్‌లో భాగంగా ఉప్పల్ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి కేవలం 125 పరుగులు చేసింది. దీంతో సన్‌రైజర్స్‌కు 126 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది.

రాజస్థాన్ జట్టులో సంజూ సామ్సన్ (42 బంతుల్లో 49; 5 ఫోర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. రహానే (13), బెన్ స్టోక్స్ (5), జోస్ బట్లర్ (6) నిరాశ పరిచారు. జట్టులోని ఏడుగురు ఆటగాళ్లు సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. సన్‌రైజర్స్ బౌలర్లలో షకీబ్ ఉల్ హాసన్, సిద్దార్ధ్ కౌల్ చెరో రెండు వికెట్లు తీయగా... భువీ, స్టాన్ లేక్, రషీద్ ఖాన్ తలో వికెట్ తీసుకున్నారు.


ఒకే ఓవర్‌లో రెండు వికెట్లు కోల్పోయిన రాజస్థాన్
ఉప్పల్ స్టేడియంలో హైదరాబాద్‌తో జరుగుతోన్న మ్యాచ్‌లో రాజస్థాన్ వరుసగా రెండు వికెట్లు కోల్పోయింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన సన్‌రైజర్స్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. బ్యాటింగ్ ఆరంభించిన రాజస్థాన్‌కు తొలి ఓవర్లోనే దెబ్బ తగిలింది. హైదరాబాద్ కెప్టెన్ విలియమ్సన్ సూపర్ త్రో చేయడంతో ఓపెనర్ డీఆర్కీ రనౌట్ అయ్యాడు.

ఆ తరవాత కెప్టెన్ రహానే (13) భారీ షాట్‌కు ప్రయత్నించి ఔటయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన బెన్ స్టోక్స్(5) ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయాడు. ఇక దూకుడుగా ఆడిన త్రిపాఠి(17)ని షకీబ్ ఔట్ చేశాడు. అదే ఓవర్లో సంజు సామ్సన్‌(49)ను కూడా షకీబ్ పెవిలియన్‌కు పంపాడు. 14 ఓవర్లు ముగిసే సరికి రాజస్థాన్ 5 వికెట్ల నష్టానికి 95 పరుగులు చేసింది.


రాజస్థాన్‌ 10 ఓవర్లకు 71/3
ఉప్పల్‌ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతోన్న మ్యాచ్‌లో రాజస్థాన్ 10 ఓవర్లకు గాను 3 వికెట్లు కోల్పోయి 71 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో సంజూ శాంసన్‌ (43), రాహుల్‌ త్రిపాఠి(2) క్రీజులో ఉన్నారు. ఈ మ్యాచ్‌లో హైదరాబాద్ ఆటగాళ్ల ఫీల్డింగ్ అద్భుతంగా ఉంది. ఆ జట్టు కెప్టెన్ కేన్‌ విలియమ్సన్‌ ఫీల్డింగ్‌ చేస్తున్నాడు. తొలి ఓవర్‌ చివరి బంతికి షార్ట్‌ను రనౌట్‌ చేసిన విలియమ్సన్ ఆ తర్వాత 8వ ఓవర్ చివరి బంతికి బెన్‌స్టోక్స్‌ (5)ను క్యాచ్‌ రూపంలో పెవిలియన్‌ పంపించాడు.


మూడో వికెట్ కోల్పోయిన రాజస్థాన్
ఉప్పల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతోన్న మ్యాచ్‌లో రాజస్థాన్ జట్టు మూడో వికెట్ కోల్పోయింది. రాజస్థాన్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ 5 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద స్టాన్ లేక్ బౌలింగ్‌లో కెప్టెన్ కేన్ విలియమ్సన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో 9 ఓవర్లు ముగిసే సరికి రాజస్థాన్ 3 వికెట్లు కోల్పోయి 63 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో సంజూ శాంసన్ (37), రాహుల్ త్రిపాఠి పరుగులేమీ చేయకుండా క్రీజులో ఉన్నారు.


రెండో వికెట్ కోల్పోయిన రాజస్థాన్
ఉప్పల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతోన్న మ్యాచ్‌లో రాజస్థాన్ జట్టు రెండో వికెట్ కోల్పోయింది. రహానే 13 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రషీద్ ఖాన్ బౌలింగ్‌లో బౌండరీ వద్ద సిద్దార్ధ్ కౌల్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో 7 ఓవర్లు ముగిసే సరికి రాజస్థాన్ 2 వికెట్లు కోల్పోయి 56 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో సంజూ శాంసన్ (35), బెన్ స్టోక్స్ పరుగులేమీ చేయకుండా ఉన్నారు.


తొలి వికెట్ కోల్పోయిన రాజస్థాన్
ఉప్పల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతోన్న మ్యాచ్‌లో రాజస్థాన్ జట్టు తొలి వికెట్ కోల్పోయింది. ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ జట్టుకు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. భువనేశ్వర్ వేసిన మొదటి ఓవర్ ఆఖరి బంతికి రాజస్థాన్ ఓపెనర్ డి ఆర్కీ షార్ట్(4) అనవసర పరుగుకు ప్రయత్నించి రనౌట్ రూపంలో పెవిలియన్ చేరాడు. దీంతో 2 ఓవర్లు ముగిసేసరికి రాజస్థాన్ 1 వికెట్ నష్టానికి 11 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో రహానే(1), సంజు శామ్సన్(5) ఉన్నారు.


టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న సన్‌రైజర్స్
ఐపీఎల్ 11వ సీజన్‌లో భాగంగా రాజస్థాన్ రాయల్స్‌తో జరుగుతోన్న తమ మొదటి మ్యాచ్‌లో టాస్ గెలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫీల్డింగ్ ఎంచుకుంది. బాల్ టాంపరింగ్ వివాదం కారణంగా స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్‌ ఐపీఎల్ నుంచి తప్పుకోవడంతో వారి స్థానంలో రెండు జట్లు కొత్త కెప్టెన్లతో బరిలోకి దిగాయి.

రాజస్థాన్ Vs హైదరాబాద్ మ్యాచ్ 4 స్కోరు కార్డు

న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్‌కు సన్‌రైజర్స్ యాజమాన్యం కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించగా.... రాజస్థాన్ రాయల్స్ యాజమాన్యం అజ్యింకె రహానే‌కు కెప్టెన్ పగ్గాలు అప్పగించింది. టాస్ గెలిచిన తర్వాత సన్‌రైజర్స్ కెప్టెన్ కేన్ విలియమ్‌సన్ మాట్లాడుతూ 'గత సీజన్లతో పోలిస్తే.. ఈసారి కొత్త జట్టుతో బరిలోకి దిగుతున్నాం. తొలుత బౌలింగ్ చేసి సీజన్‌ని గొప్పగా ఆరంభిస్తాం. మా జట్టులో విదేశీ ప్లేయర్లు రషీద్ ఖాన్, స్టాన్‌లేక్, నేను, షకీబ్ అల్ హసన్‌ ఆడుతున్నాం' అని అన్నాడు.

అనంతరం రహానే మాట్లాడుతూ 'మేము తొలుత బౌలింగ్ చేయాలని అనుకున్నాం. కానీ టాస్‌ని మనం కంట్రోల్ చేయలేx. తొలుత బ్యాటింగ్ చేయడం కూడా సంతోషమే, ఇందుకోసం మేం పూర్తిగా సిద్ధమై ఉన్నాం. ఈ ఆట కోసం మేం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం. బెన్ స్టోక్స్, బట్లర్, షార్ట్, లాఫ్‌లిన్ నలుగురు విదేశీ ఆటగాళ్లతో బరిలోకి దిగుతున్నాం' అని తెలిపాడు.

ఈ సీజన్‌లో ఈ రెండు జట్లు తలపడుతున్న మొదటి మ్యాచ్‌ ఇదే. ఇదిలా ఉంటే ఈ ఏడాది జనవరిలో జరిగిన ఐపీఎల్ వేలంలో అత్యధిక ధర పలికన బెన్ స్టోక్స్‌, జయదేవ్‌ ఉనాద్కత్‌, మనీశ్‌ పాండేలు ఈ మ్యాచ్‌లో ఆడుతున్నారు.

ఉప్పల్‌లో అభిమానుల సందడి
హైదరాబాద్-రాజస్థాన్ జట్ల మధ్య జరిగే ఐపీఎల్‌ క్రికెట్‌ మ్యాచ్‌ను తిలకించేందుకు అభిమానులు ఉప్పల్ స్టేడియానికి పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు. దీంతో ఉప్పల్‌ పరిసర ప్రాంతాల్లో కోలాహల వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు.

ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా స్టేడియం పరిసర ప్రాంతాల్లో 100 సీసీ కెమెరాలతో నిఘా పర్యవేక్షిస్తున్నారు. భద్రతను కట్టుదిట్టం చేశారు. సుమారు 2500 మంది సిబ్బందితో భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. వాటర్‌ బాటిళ్లు సహా 17 రకాల వస్తువులను మైదానంలోకి అనుమతించేందుకు నిరాకరించారు.

జట్ల వివరాలు:
సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌:
శిఖర్ ధావన్‌, కేన్‌ విలియమ్సన్‌ (కెప్టెన్‌), మనీష్‌ పాండే, వృద్ధిమాన్ సాహా(వికెట్‌కీపర్‌), దీపక్‌ హుడా, యూసుఫ్‌ పఠాన్‌, భువనేశ్వర్‌ కుమార్, రషీద్‌ ఖాన్‌, షకీబ్ ఉల్‌ హాసన్‌, సిదార్ధ్‌ కౌల్‌, బిల్లి స్టాన్‌లేక్

రాజస్థాన్‌ రాయల్స్‌:
రహానె(కెప్టెన్‌), డి ఆర్కీ షార్ట్, సంజు శామ్సన్‌, రాహుల్‌ త్రిపాఠి, బెన్‌ స్టోక్స్‌, జోస్‌ బట్లర్‌, కృష్ణప్ప గౌతమ్‌, శ్రేయస్స్ గోపాల్, ధవల్‌ కులకర్ణి, జయదేవ్‌ ఉనాద్కట్‌, బెన్ లాఫ్‌లిన్

రికెట్ అంటే ఇష్టమా? నిరూపించు! మైఖేల్ ఫాంటసీ క్రికెట్ ఆడు

Story first published: Monday, April 9, 2018, 19:38 [IST]
Other articles published on Apr 9, 2018

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి