ఐపీఎల్ 2018: సన్‌రైజర్స్ హైదరాబాద్ హ్యాట్రిక్ విజయాల నమోదు

Posted By:
Sunrisers Hyderabad

హైదరాబాద్: ఐపీఎల్‌-11వ సీజన్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ మరోసారి మెరిసింది. ఈ సీజన్లో వరుసగా మూడో విజయాన్ని నమోదు చేసింది. ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా ఆతిథ్య కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో విజయం సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళ్లింది. కోల్‌కతా నిర్దేశించిన 139 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సన్‌రైజర్స్‌ ఒక ఓవర్‌ మిగిలి ఉండగానే లక్ష్యాన్ని చేధించింది.

హైదరాబాద్‌ బ్యాట్స్‌మెన్లలో దూకుడుగా ఆడిన సాహా (24), ధావన్‌(7)లను నరైన్ పెవిలియన్ చేర్చగా.. ఆ తర్వాత క్రీజులోకి దిగిన మనీష్ పాండే(4)ను కుల్దీప్ యాదవ్‌ ఎల్బీగా పెవిలియన్ కు చేర్చాడు. స్పిన్నర్ల ధాటికి 55 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన సన్‌రైజర్స్‌ను విలియమ్సన్ (50), షకీబ్ ఉల్ హసన్ (27) ఆదుకున్నారు.

వీరిద్దరూ నాలుగో వికెట్‌కు 60 పరుగులు జోడించారు. విజయానికి 25 పరుగుల దూరంలోషకీబ్ ఉల్ హసన్ చావ్లా బౌలింగ్‌లో ఔటయ్యాడు. చివర్లో దీపక్ హుడా (5), యూసుఫ్ పఠాన్ (17 నాటౌట్‌) రాణించడంతో మరో ఓవర్ మిగిలి ఉండగానే జట్టుకు విజయాన్ని అందించారు.

అంతకు ముందు టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన కోల్‌కతా జట్టు 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 138 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. ఈడెన్ గార్డెన్స్‌లో సన్‌రైజర్స్ ఆరు మ్యాచ్‌లు ఆడగా.. ఆ జట్టుకు ఇది తొలి గెలుపు కావడం విశేషం. కోల్ కతా బౌలర్లలో నరేన్ 2, మిచెల్ జాన్సన్, పియూష్ చావ్లా, కుల్దీప్ యాదవ్ తలో వికెట్ తీసుకున్నారు.


సన్‌రైజర్స్ హైదరాబాద్ విజయ లక్ష్యం 139
ఈడెన్ గార్డెన్స్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతోన్న మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 138 పరుగులు చేసింది. దీంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకి 139 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.

టాస్ ఓడి తోలుత బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా జట్టులో ఓపెనర్ క్రిస్‌లిన్ (49) రాణించగా, రాబిన్ ఉతప్ప (3), నితీశ్ రానా (18), సునీల్ నరైన్ (9), ఆండ్రీ రసెల్ (9) తక్కువ స్కోరుకే పరిమితమయ్యారు. చివర్లో కెప్టెన్ దినేశ్ కార్తీక్ (29) ఫర్వాలేదనిపించాడు.

మ్యాచ్ ఆరంభం నుంచే సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు పడగొట్టడంతో కోల్‌కతా బ్యాట్స్‌మెన్ ఒత్తిడికి గురయ్యారు. సన్‌రైజర్స్ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ 3, స్టాన్ లేక్, షకీబ్ ఉల్ హాసన్ చెరో 2 వికెట్లు తీసుకోగా... సిద్దార్థ్ కౌల్‌కు ఒక వికెట్ లభించింది.


మనీశ్ పాండే అద్భుతమైన ఫీల్డింగ్
వర్షం కారణంగా నిలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్- కోల్‌కతా నైట్‌రైడర్స్ మ్యాచ్ మళ్లీ ఆరంభమైన తొలి ఓవర్‌లోనే మనీశ్ పాండే అద్భుతమైన ఫీల్డింగ్ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. వర్షం తర్వాత మ్యాచ్‌ పునప్రారంభమైన నాలుగు బంతులకే కోల్‌కతా స్టార్‌ బ్యాట్స్‌మన్‌ నితీష్‌ రాణా స్టాన్‌ లేక్‌ బౌలింగ్‌లో ఆఫ్‌ వికెట్‌ మీదుగా వచ్చిన బంతిని గల్లీలో ఆడే ప్రయత్నం చేశాడు.

ఆ సమయంలో అక్కడే ఫీల్డింగ్‌ చేస్తున్న మనీష్ పాండే రెప్పపాటు సమయంలో గాల్లోకి డైవ్‌ చేసి అద్భుతమైన క్యాచ్‌గా దానిని అందుకున్నాడు. అయితే, తొలుత పాండే చేతుల నుంచి బంతి జారినట్లే జారి చిక్కింది. దీంతో దూకుడుగా ఆడుతోన్న నితీష్‌ రాణా (14 బంతుల్లో 18; 2 ఫోర్లు, ఒక సిక్సు) వద్ద పెవిలియన్‌ చేరాడు.


కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తోన్న సన్‌రైజర్స్
కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేస్తోంది. వరుస వికెట్లు తీస్తూ ప్రత్యర్థి జట్టు బ్యాట్స్‌మన్‌ను పెవిలియన్‌కు పంపిస్తున్నారు. దీంతో 15 ఓవర్లు ముగిసే సరికి కోల్‌కతా 5 వికెట్లు కోల్పోయి 106 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో దినేశ్‌ కార్తీక్‌ (12), శుభ్‌మన్‌ గిల్‌ (1) పరుగులతో ఉన్నారు.


10 ఓవర్లకు కోల్‌కతా 70/2
ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ నిలకడగా ఆడుతోంది. 10 ఓవర్లు ముగిసే సరికి 2 వికెట్లు కోల్పోయి ఆ జట్టు 70 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో ఓపెనర్‌ క్రిస్‌ లిన్‌ (46), సునిల్‌ నరైన్‌ (3) పరుగులతో ఉన్నారు.


ఈడెన్‌లో నిలిచిన వర్షం: ప్రారంభమైన మ్యాచ్
వర్షం కారణంగా నిలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్- కోల్‌కతా నైట్‌రైడర్స్ మ్యాచ్ మళ్లీ ప్రారంభమైంది. మ్యాచ్ సమయం దాదాపు గంట వేస్ట్ అయినా.. ఎలాంటి ఓవర్లు కుదింపు లేకుండానే మ్యాచ్‌ని అంపైర్లు కొనసాగిస్తున్నారు. క్రీజులో ఓపెనర్ క్రిస్ లిన్ (31 నాటౌట్), నితీశ్ రానా (18 నాటౌట్) ఉండగా వరుణుడు అంతరాయం కలిగించిన సంగతి తెలిసిందే.


వర్షంతో నిలిచిన మ్యాచ్
ఈడెన్ గార్డెన్స్‌లో హైదరాబాద్-కోల్‌కతా జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్‌కి వరుణుడు అంతరాయం కలిగించాడు. వర్షం కారణంగా మ్యాచ్ నిలిచే సమయానికి కోల్‌కతా 7ఓవర్లకు గాను ఒక వికెట్ కోల్పోయి 52 పరుగులతో ఉంది. ప్రస్తుతం క్రీజులో క్రిస్ లిన్ (31), నితీష్ రాణా (18) పరుగులతో ఉన్నారు.


5 ఓవర్లకు కోల్‌కతా 37/1
ఈడెన్ గార్డెన్స్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతోన్న మ్యాచ్‌లో కోల్‌కతా 5 ఓవర్లకు గాను వికెట్ నష్టానికి 37 పరుగులు చేసింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ ప్రారంభించిన కోల్‌కతా జట్టుకు శుభారంభం లభించలేదు. ఈ మ్యాచ్లో ఓపెనర్ క్రిస్ లిన్ ఇచ్చిన క్యాచ్‌ని సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ ఆదిలోనే క్యాచ్‌ని జారవిడిచాడు.

ఇన్నింగ్స్ రెండో ఓవర్ వేసిన స్టాన్‌లేక్ బౌలింగ్‌లో బంతిని.. మిడాఫ్ దిశగా బౌండరీకి తరలించేందుకు కోల్‌కతా ఓపెనర్ క్రిస్‌లిన్ ప్రయత్నించాడు. అయితే, మిడాఫ్‌లో ఫీల్డింగ్ చేస్తున్న విలియమ్సన్‌ తలపైగా అది వెళ్తుండగా... వెనక్కి పరుగెత్తుకుంటూ వెళ్లిన విలియమ్సన్.. బంతిని అందుకోవడంలో విఫలమయ్యాడు.

దీంతో బంతి అతని చేతిని తాకుతూ నేలపై పడి బౌండరీకి వెళ్లింది. ఆ తర్వాతి ఓవర్‌లోనే భువనేశ్వర్ బౌలింగ్‌లో మరో ఓపెనర్ ఉతప్ప (3) కీపర్ సాహాకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు.

టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న సన్‌రైజర్స్
ఐపీఎల్ టోర్నీలో భాగంగా శనివారం సన్‌రైజర్స్ హైదరాబాద్-కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్ల మధ్య మ్యాచ్ ప్రారంభమైంది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరుగుతోన్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన సన్‌రైజర్స్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు.

హైదరాబాద్ Vs కోల్‌కతా లైవ్ స్కోరు కార్డు

ఈ సీజన్‌లో ఆడిన రెండు మ్యాచ్‌ల్లో సన్‌రైజర్స్ విజయాలను నమోదు చేసిన మంచి ఊపుమీదుంది. ఈ సీజన్‌లో రెండు మ్యాచ్‌లకు రెండు మ్యాచ్‌లు గెలిచి పాయింట్ల పట్టికలో టాప్‌లో ఉన్న హైదరాబాద్‌కు ఈ మ్యాచ్ కఠిన పరీక్ష కానుంది. ఎందుకంటే సన్ రైజర్స్ గెలిచిన రెండు మ్యాచ్‌లు హోం గ్రౌండ్‌లో కావడం.

ఈ సీజన్‌లో సన్ రైజర్స్ తొలి సారి సొంతమైదానం వెలుపుల ఆడుతోంది. ఈ మ్యాచ్‌ను సైతం గెలిచి తమ విజయాత్రను కొనసాగించాలని సన్‌రైజర్స్‌ భావిస్తుండగా.. ఇక తొలి మ్యాచ్‌ గెలిచి రెండో మ్యాచ్‌లో ఓడిన కోల్‌కతా ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలవాలని ఉవ్విళ్లురుతోంది.

మరోవైపు కోల్‌కతా ఆడిన రెండు మ్యాచ్‌ల్లో ఒకదానిలో విజయం సాధించగా, మరొకదాంట్లో ఓటమి పాలైంది. దీంతో సొంతగడ్డపై అభిమానుల మధ్య జరుగుతోన్న మ్యాచ్ కావడంతో ఈ మ్యాచ్‌లో విజయం సాధించాలనే పట్టుదలతో ఉంది. ఇక ఇరు జట్లలో స్పల్ప మార్పులు చోటుచేసుకున్నాయి.

హైదరాబాద్‌ జట్టులోకి సందీప్‌ శర్మ స్థానంలో భువనేశ్వర్‌ రాగా.. కోల్‌కతాలో రింకు సింగ్‌ స్థానంలో అండర్‌-19 సూపర్‌ హీరో శుభ్‌మన్‌ గిల్‌ వచ్చాడు.

తుది జట్లు:

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌:
కేన్‌ విలియమ్సన్‌(కెప్టెన్‌), శిఖర్‌ ధావన్‌, వృద్ధిమాన్‌ సాహా, మనీష్‌ పాండే, యూసఫ్‌ పఠాన్‌‌, రషీద్‌ ఖాన్‌, షకీబుల్‌ హసన్‌‌, దీపక్‌ హుడా, బిల్లీ స్టాన్‌లేక్‌, భువనేశ్వర్‌ కుమార్‌, సిద్దార్థ్‌ కౌల్‌

కోల్‌కతా నైట్‌రైడర్స్‌:
దినేశ్‌ కార్తీక్‌(కెప్టెన్‌), రాబిన్‌ ఉతప్ప, క్రిస్‌ లిన్‌, నితీష్‌ రాణా, శుభమన్‌ గిల్‌‌‌, ఆండ్రూ రస్సెల్‌‌, సునీల్‌ నరైన్‌, పియూష్‌ చావ్లా, వినయ్‌ కుమార్‌, కుల్దీప్‌ యాదవ్‌, టామ్‌ కుర్రాన్‌

రికెట్ అంటే ఇష్టమా? నిరూపించు! మైఖేల్ ఫాంటసీ క్రికెట్ ఆడు

Story first published: Saturday, April 14, 2018, 19:38 [IST]
Other articles published on Apr 14, 2018

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి