
గొప్ప ఆరంభం లభించింది
'ఛేజింగ్ చేసే సమయంలో మాకు గొప్ప ఆరంభం లభించింది. దాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాం. 10 ఓవర్ల వరకు గేమ్ మావైపే ఉంది. కొన్ని చెత్త షాట్లు మా కొంప ముంచాయి. నాతోపాటు నితీష్ రాణా, రాబిన్ ఉతప్పలు మ్యాచ్‌ను ముగిస్తే బాగుండేది. అలా జరగలేదు. దాంతో ఓటమి చూడాల్సి వచ‍్చింది' అని దినేశ్ కార్తీక్ పేర్కొన్నాడు.

సన్‌రైజర్స్ మాకంటే మెరుగ్గా రాణించింది
'సన్‌రైజర్స్ మాకంటే మెరుగ్గా రాణించి గెలుపును సొంతం చేసుకుంది. ఈ ఐపీఎల్‌లో యువ క్రికెటర్లు వారికి వచ్చిన అవకాశాన్ని ఒడిసిపట్టుకున్నారు. క్రెడిట్ మొత్తం సన్‌రైజర్స్‌కే ఇవ్వాలి. వారి టార్గెట్‌ను డిఫెండ్ చేసుకున్న తీరు నిజంగా అద్భుతం. ఈడెన్ గార్డెన్‌లో రెండుసార్లు మమ్మల్ని ఓడించారు' అని దినేశ్ కార్తీక్ పేర్కొన్నాడు.

13 పరుగుల తేడాతో హైదరాబాద్ విజయం
ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన రెండో క్వాలిఫయిర్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ 13 పరుగుల తేడాతో విజయం సాధించింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్దేశించిన 175 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్‌కతా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 161 పరుగులు మాత్రమే చేయగలిగింది. 175 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన కోల్‌కతాకి ఓపెనర్లు మంచి ఆరంభాన్ని అందించారు.

తొలి వికెట్‌కి 40 పరుగుల భాగస్వామ్యం
తొలి వికెట్‌కి 40 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. ఆ తర్వాత సిద్ధార్త్ కౌల్ వేసిన నాలుగో ఓవర్‌లో నరైన్(26) భారీ షాట్‌కు ప్రయత్నించి బ్రాత్‌వైట్‌కి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఈ దశలో నితీశ్ రానా, లిన్‌ల జోడీ జట్టును ఆదుకొనే ప్రయత్నం చేశారు. వీరిద్దరు కలిసి రెండో వికెట్‌కి 47 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. అయితే రషీద్ వేసిన 9వ ఓవర్ మూడో బంతికి రానా(22) రెండో పరుగులు తీసేందుకు ప్రయత్నించి రనౌట్ అయ్యాడు.

2 పరుగుల వద్ద రాబిన్ ఊతప్ప క్లీన్ బౌల్డ్
ఆ తర్వాత మళ్లీ రషీద్ బౌలింగ్‌లో ఉతప్ప(2) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత కొంత సమయానికే కెప్టెన్ దినేశ్ కార్తీక్(8) షకీబ్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఈ దశలో మరో ఓపెనర్ క్రిస్ లిన్ స్కోరు బోర్డుని నడిపించాడు. 31 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సులు కొట్టి 48 పరుగులు చేశాడు. కానీ రషీద్ వేసిన 13వ ఓవర్ 2 బంతికి ఎల్బీగా వెనుదిరిగాడు. రషీద్ వేసిన ఆ తర్వాతి ఓవర్‌లో లిన్ స్లిప్‌లో ఉన్న ధవన్‌కి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.

శుభ్‌మాన్ గిల్ ఆదుకొనే ప్రయత్నం
ఈ దశలో కష్టాల్లోపడ్డ జట్టును శుభ్‌మాన్ గిల్ ఆదుకొనే ప్రయత్నం చేశాడు. ఈ దశలో మ్యాచ్ ఉత్కంఠగా మారింది. అయితే చివరి ఓవర్‌లో 15 పరుగులు కావాల్సి ఉండగా.. బ్రాత్‌వైట్ ఆ ఓవర్‌లో మావీ(6), గిల్(30)లను వరుసగా పెవిలియన్ బాటపట్టించాడు. దీంతో సన్‌రైజర్స్ ఈ మ్యాచ్‌లో 13 పరుగల తేడాతో విజయం సాధించి ఫైనల్స్‌కి దూసుకెళ్లింది. ఆదివారం ముంబైలోని వాంఖడె స్టేడియంలో జరగనున్న ఫైనల్లో చెన్నై సూపర్ కింగ్స్‌తో సన్‌రైజర్స్ హైదరాబాద్ తలపడనుంది.

రషీద్ ఖాన్‌కు మ్యాచ్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు
సన్‌రైజర్స్ హైదరాబాద్‌కి ఇది రెండో ఐపీఎల్ ఫైనల్స్ కావడం విశేషం. అటు బ్యాటింగ్‌లోనూ, ఇటు బౌలింగ్, ఫీల్డింగ్‌లో అద్భుత ప్రదర్శన చేసిన రషీద్ ఖాన్‌కు మ్యాచ్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్లలో రషీద్ ఖాన్ 3, సిద్దార్థ్ కౌల్, కార్లోస్ బ్రాత్‌వైట్ తలో 2 వికెట్లు తీసుకోగా... షకీబ్ అల్ హసన్ ఒక వికెట్ పడగొట్టాడు.


Click it and Unblock the Notifications












