జోస్ బట్లర్‌ను ఎలా ఔట్ చేశానంటే!: వెల్లడించిన కుల్దీప్

హైదరాబాద్: ప్లేఆఫ్ రేసులో ఉండాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. టోర్నీలో భాగంగా మంగళవారం రాత్రి రాజస్థాన్ రాయల్స్‌తో ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఓపెనర్ క్రిస్‌లిన్ (45), కెప్టెన్ దినేశ్ కార్తీక్ (41 నాటౌట్) రాణంచడంతో కోల్‌కతా నైట్‌రైడర్స్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే.

కోల్‌కతా విజయం వెనుక స్పిన్నర్ కుల్దీప్ యాదవ్
అయితే, కోల్‌కతా విజయం సాధించడంలో ఆ జట్టు చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ కీలకపాత్ర పోషించిన సంగతి తెలిసిందే. నాలుగు వికెట్లు తీసి రాజస్థాన్ రాయల్స్‌ను తక్కువ స్కోరుకే కట్టడి చేశాడు. ముఖ్యంగా వరుసగా ఐదు మ్యాచ్‌ల్లో ఐదు హాఫ్ సెంచరీలు సాధించి చక్కటి ఫామ్‌లో ఉన్న జోస్ బట్లర్(39) పరుగుల వద్ద పెవిలియన్‌కు చేర్చాడు.

బట్లర్‌ను ఔట్ చేసేందుకు ప్రత్యేక వ్యూహాం
జోస్ బట్లర్‌ను ఔట్ చేసేందుకు ప్రత్యేక వ్యూహాలు రచించినట్లు మ్యాచ్ అనంతరం మాట్లాడిన కుల్దీప్ యాదవ్ వెల్లడించాడు. 'బౌలింగ్ వేసే ముందు కాస్త ఒత్తిడికి గురయ్యాను. ప్లేఆఫ్ చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్ ఇది. దీంతో వికెట్లు తీయడంపైనే దృష్టి పెట్టాను. జాస్ బట్లర్ మంచి ఫామ్‌లో ఉన్నాడు. అతడిని పెవిలియన్‌కు పంపాలనుకున్నాను' అని కుల్దీప్ అన్నాడు.

బట్లర్ రివర్స్ స్వీప్ ఆడతాడని తెలుసు
'బట్లర్‌ను ఔట్ చేయాలనే క్రమంలో నాకు నేనే సర్ది చెప్పుకున్నాను. నా సామర్థ్యాన్ని నమ్ముకున్నాను. విజయవంతం అయ్యాను. బట్లర్ రివర్స్ స్వీప్ ఆడతాడని తెలుసు. అందుకే అలా ఆడేలా ఓ బంతిని వేశాను. అతను ఔటయ్యాడు. ప్రతి మ్యాచ్‌లో ప్రతి బ్యాట్స్‌మెన్ కోసం బౌలర్లు వ్యూహాలు రచించుకుంటారు. కొన్నిసార్లు సక్సెస్ అవుతాం, మరికొన్నిసార్లు విఫలమవుతాం' అని అన్నాడు.

4 వికెట్లు తీసి 20 పరుగులిచ్చిన కుల్దీప్ యాదవ్
ఈ మ్యాచ్‌లో నాలుగు ఓవర్లు వేసిన కుల్దీప్ యాదవ్ 4 వికెట్లు తీసి 20 పరుగులిచ్చాడు. దీంతో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కించుకున్నాడు. తాజా విజయంతో కోల్‌కతా 14 పాయింట్లతో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో నిలవగా, రాజస్థాన్ ప్లేఆఫ్ ఆశల్ని సంక్లిష్టం చేసుకుంది. టోర్నీలో భాగంగా కోల్‌కతా తన తదుపరి మ్యాచ్‌లో హైదరాబాద్‌తో తలపడనుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications