
హైదరాబాద్: ముంబై ఇండియన్స్ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ తృటిలో పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టోర్నీలో భాగంగా మంగళవారం రాత్రి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ హెల్మెట్ పెట్టుకోకుండా కీపింగ్ చేశాడు.
ఇన్నింగ్స్ 14వ ఓవర్ వేసేందుకు జస్ప్రీత్ బుమ్రా బంతిని అందుకున్నాడు. ఆ ఓవర్లో నాలుగో బంతిని ఎదుర్కొన్న విరాట్ కోహ్లీ మిడ్ వికెట్ మీదుగా ఆడాడు. అదే సమయంలో అక్కడ ఫీల్డింగ్ చేస్తోన్న పాండ్యా ఆ బంతిని అందుకుని వికెట్ కీపర్ ఇషాన్ కిషన్‌కు విసిరాడు. ఆ బంతి ఇషాన్ కుడి వైపు కంటికి సమీపంలో తాకింది.

దీంతో అతడు నొప్పితో మైదానంలో విలవిల్లాడిపోయాడు. ఫిజియో వచ్చి గాయాన్ని పరిశీలించడం... ఆ తర్వాత బంతి తాకిన చోట ఐస్ బ్యాగ్ పెట్టడం జరిగింది. అయినప్పటికీ ఫలితం లేకపోవడంతో మ్యాచ్ మధ్యలోనే మైదానాన్ని వీడాడు. దీంతో అతడి స్థానంలో ఆదిత్య తారే వికెట్ కీపింగ్ బాధ్యతలు నిర్వర్తించాడు.
2017 అక్టోబరు 1 నుంచి అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) కొత్త నిబంధనలు అమల్లోకి రావడంతో సబ్‌స్టిట్యూట్ ఫీల్డర్ చేత కీపింగ్ చేయించుకునే వెసులుబాటు కల్పించింది. అంతకుముందు వరకు సబ్‌స్టిట్యూట్ వచ్చి కీపింగ్ చేసేందుకు అనుమతి ఉండేది కాదు. ఈ నిబంధన ఇప్పుడు ఉపయోగపడింది.
ఐపీఎల్‌లో ఎంతో అనుభవం ఉన్న ధోని, దినేశ్ కార్తీక్, సాహా, డీకాక్, జోస్ బట్లర్ లాంటి వారే కీపింగ్ చేసేటప్పుడు హెల్మెట్‌ను ధరిస్తుంటే ఇషాన్ కిషన్, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ లాంటి యువ ఆటగాళ్లు ఎందుకు హెల్మెట్ పెట్టుకోవడం లేదంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు మండిపడుతున్నారు.