
హైదరాబాద్: ఐపీఎల్ 11వ సీజన్ టైటిల్ విజేతగా చెన్నై సూపర్ కింగ్స్ నిలుస్తుందని ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్ షేన్‌వార్న్ అభిప్రాయపడ్డాడు. ముంబై వాంఖడె వేదికగా ఐపీఎల్ ఫైనల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్-చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడుతున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ కోసం తాను ఆతృతగా ఎదురు చూస్తున్నట్లు షేన్ వార్న్ తెలిపాడు.
అంతేకాదు ట్విట్టర్ ద్వారా తన డ్రీమ్ ఐపీఎల్ జట్టుని కూడా ప్రకటించాడు. ఈ సందర్భంగా ఫైనల్లో తన అంచనా ప్రకారం చెన్నై సూపర్ కింగ్స్ గెలస్తుందని జోస్యం చెప్పాడు. ఐపీఎల్ ఆరంభ సీజన్(2008)లో రాజస్థాన్ రాయల్స్‌ను టైటిల్ విజేతగా నిలిపిన షేన్ వార్న్ తన ఐపీఎల్ 'ఆల్ స్టార్ టీమ్'లో ఏకంగా నలుగురు వికెట్ కీపర్లకి చోటిచ్చాడు.
తన ఆల్‌స్టార్ జట్టులో జోస్ బట్లర్, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లి, రిషబ్ పంత్, ఎంఎస్ ధోని, హార్దిక్ పాండ్యా, ఆండ్రూ రస్సెల్, రషీద్ ఖాన్, ఆండ్రూ టై, కుల్దీప్, బ్రుమాలకు చోటిచ్చాడు. ఈ జట్టును అంగీకరిస్తారా? అని అభిమానులను ప్రశ్నించాడు. జోస్ బట్లర్ 548 పరుగులు, కేఎల్ రాహుల్ 659 పరుగులు చేశారు.
విరాట్ కోహ్లీ 530 పరుగులు, రిషబ్ పంత్ (ఢిల్లీ డేర్‌డెవిల్స్) 684 పరుగులు, మహేంద్రసింగ్ ధోని 455 పరుగులు, హార్దిక్ పాండ్యా 260 పరుగులు +18 వికెట్లు, ఆండ్రీ రసెల్ 316 పరుగులు +13 వికెట్లు, రషీద్ ఖాన్ 21 వికెట్లు, ఆండ్రూ టై (పంజాబ్) 24 వికెట్లు, కుల్దీప్ యాదవ్ 17 వికెట్లు, జస్‌ప్రీత్ బుమ్రా 17 వికెట్లు పడగొట్టారు.
అయితే ఈ జట్టులో అద్భుత కెప్టెన్సీతో సన్‌రైజర్స్‌ను ఫైనల్‌కు చేర్చిన కేన్ విలియమ్సన్ చోటివ్వకపోవడాన్ని అభిమానులు తప్పు బట్టారు. ఈ సీజన్‌లో అత్యధిక పరుగులు సాధించిన విలియమ్సన్‌కు చోటు లేకపోవడం ఏమిటని ఓ అభిమాని వార్న్‌ను నిలదీశాడు. ఇక ఫైనల్ గెలుపుపై సైతం అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
అలాగే ప్రపంచ గొప్ప బ్యాట్స్‌మన్ డివిలియర్స్ లేనిది గొప్ప జట్టు ఎలా అవుతుందని ఇంకొందరు ట్విట్టర్‌లో వార్నర్‌ను ప్రశ్నించారు. టోర్నీ ఆరంభం నుంచి నిలకడగా రాణించిన అంబటి రాయుడు, కేన్ విలియమ్సన్, భువనేశ్వర్ కుమార్, సునీల్ నరైన్, ఉమేశ్ యాదవ్‌లకు ఇందులో చోటు దక్కకపోవడం గమనార్హం.
షేన్ వార్న్ ఎంపిక చేసిన జట్టు:
జోస్ బట్లర్, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లి, రిషబ్ పంత్, మహేంద్రసింగ్ ధోని, హార్దిక్ పాండ్య, ఆండ్రీ రసెల్, రషీద్ ఖాన్, ఆండ్రూ టై, కుల్దీప్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా