
హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్ ఎవరనే సస్పెన్షన్‌కు తెరవీడింది. ఎవరూ ఊహించని విధంగా అందరి అంచనాలను తలకిందులు చేస్తూ వికెట్ కీపర్, బ్యాట్స్‌మన్ అయిన దినేశ్ కార్తిక్‌ను సారథిగా ఎంపిక చేస్తూ కేకేఆర్ యాజమాన్యం నిర్ణయం తీసుకుంది.
ఈ మేరకు దినేశ్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేసిన విషయాన్ని కేకేఆర్ ఫ్రాంచైజీ ఆదివారం తన ట్విట్టర్‌లో అధికారికంగా ప్రకటించింది. గతంలో కోల్‌కతా నైట్‌రైడర్స్ కెప్టెన్‌గా పనిచేసిన గౌతం గంభీర్‌ను వదిలేసుకున్న ఆ జట్టు.. ఈ సీజన్‌లో ఎవరికి కెప్టెన్సీ బాధ్యతలు అప్పచెప్పాలనే దానిపై గత కొన్నిరోలుగా ఆలోచన చేస్తోంది.
ఈ క్రమంలో గత కొన్నేళ్లుగా ఆ జట్టులో కొనసాగుతున్న సీనియర్ బ్యాట్స్‌మన్ రాబిన్ ఉతప్ప, ఆస్ట్రేలియా హార్డ్ హిట్టర్ క్రిస్‌లిన్, విండీస్ ఆల్‌రౌండర్ సునీల్ నరైన్‌లో ఒకరికి సారథ్య బాధ్యతలు అప్పగిస్తారని ప్రచారం జరిగింది. అయితే చివరకు దినేశ్ కార్తీక్‌నే సారథిగా నియమించడానికి కేకేఆర్ యాజమాన్యం మొగ్గుచూపింది.
ఐపీఎల్-2018 సీజన్‌లో దినేశ్ కార్తిక్ తమ జట్టును ముందుండి నడిపిస్తాడని ఫ్రాంఛైజీ సీఈవో వెంకీ మైసూర్ ఆదివారం అధికారికంగా వెల్లడించారు. 'మేమంతా దీర్ఘకాలిక మార్పును కోరుకున్నాం, మాజీ కెప్టెన్ గౌతమ్ గంభీర్ తరహాలో జట్టుకు సారథ్యం వహించే సామర్థ్యం ఉన్న ఆటగాడి కోసం పరిశోధించి ఈ నిర్ణయం తీసుకున్నాం' అని వెంకీ వెల్లడించాడు.
గత ఐపీఎల్ సీజన్‌లో గుజరాత్ లయన్స్‌కు ఆడిన దినేశ్ కార్తీక్‌ను జనవరిలో నిర్వహించిన ఐపీఎల్ వేలంలో రూ.7.4 కోట్లను వెచ్చించి కోల్‌కతా కొనుగోలు చేసింది. గత సీజన్‌లో మొత్తం 14 మ్యాచ్‌ల్లో 361 పరుగులు నమోదు చేశాడు. మొత్తం 152 మ్యాచ్‌ల ఐపీఎల్ అనుభవం ఉన్న దినేశ్ కార్తీక్.. 2,903 పరుగులు సాధించాడు. ఇందులో 14 హాఫ్ సెంచరీలున్నాయి.
కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్‌గా ఎంపికైన అనంతరం దినేశ్ కార్తిక్ మాట్లాడుతూ 'గత పదేళ్ల నుంచి కోల్‌కతా స్థిరంగా రాణిస్తోంది. ఈ జట్టుకు గొప్ప వారసత్వం ఉంది. నాకు చాలా సంతోషంగా ఉంది. కోల్‌కతాకు నాయకత్వ బాధ్యతలు చేపట్టడం గౌరవంగా భావిస్తున్నా' అని తెలిపాడు.