హైదరాబాద్: ఐపీఎల్ పదో సీజన్‌లో భాగంగా వాంఖడె వేదికగా గురువారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్ క్రికెటర్ మార్టిన్ గుప్తిల్ అద్భుతమైన క్యాచ్ అందుకున్నాడు. దీంతో ప్లేయర్ ఆఫ్ ది బెస్ట్ క్యాచ్ అవార్డుని సొంతం చేసుకున్నాడు.
గుప్తిల్ ఈ ఈ క్యాచ్ పట్టిన తీరుని చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే. మ్యాక్స్‌వెల్ బౌలింగ్‌లో ముంబై ఓపెనర్ సిమ్మన్స్ భారీ షాట్ ఆడాడు. ఆ బంతిని బౌండరీ లైన్ వద్ద ఉన్న కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఆటగాడు మార్టిన గుప్తిల్ క్యాచ్ పట్టేందుకు అమాంతం గాల్లోకి ఎగిరాడు.
తొలుత రెండు చేతులతో క్యాచ్ పట్టాలని భావించిన గుప్తిల్ అది అసాధ్యమని భావించి కేవలం ఒంటిచేత్తో బంతిని ఒడిసి పట్టుకున్నాడు. అంతేకాదు ఆపై బౌండరీ లైన్‌ను తాకకుండా జాగ్రత్తగా శరీరాన్ని నియంత్రించుకున్నాడు. గుప్తిల్ క్యాచ్‌పై ప్రశంసలు వెల్లువలా వస్తున్నాయి.
దీంతో ముంబై స్కోరు 106 పరుగుల వద్ద సిమ్మన్స్ (32 బంతుల్లో 59; 5 ఫోర్లు, 4 సిక్సర్లు) రెండో వికెట్‌గా కోల్పోయింది. గుప్తిల్ పట్టిన క్యాచ్‌కు పంజాబ్ ఆటగాళ్లతో పాటు ఇతర జట్ల ఆటగాళ్లు కూడా ముగ్దులయ్యారు.
ఈ మ్యాచ్‌లో మార్టిన్ గుప్తిల్ మరో రెండు క్యాచులు పట్టి నితీశ్ రాణా, రోహిత్ శర్మలను పెవిలియన్‌కు చేర్చాడు. ఈ మ్యాచ్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ 7 పరుగుల తేడాతో విజయం సాధించింది. 231 భారీ విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 223 పరుగులు మాత్రమే చేసింది.