హైదరాబాద్: ఐపీఎల్ ఫ్రాంచైజీ రైజింగ్ పూణె సూపర్ జెయింట్స్ తమ జట్టు కెప్టెన్సీ నుంచి ధోనిని తప్పించడంపై ఓవైపు విమర్శలు వెల్లువెత్తుతుంటే, టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ మాత్రం సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాడు. అయితే సెహ్వాగ్ ఈ వ్యాఖ్యలు చేయడం వెనుక ఓ కారణం ఉంది.
ఐపీఎల్‌లో సెహ్వాగ్ గతంలో పంజాబ్ జట్టుకు ప్రాతినిధ్యం వహించి ఆ తర్వాత రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇటీవల పంజాబ్ క్రికెట్ ఆపరేషన్స్ హెడ్‌గా బాధ్యతలు చేపట్టడంతో పాటు మెంటార్‌గా కూడా కొనసాగుతున్నాడు. 'ధోని కెప్టెన్‌గా లేకపోవడం నాకు సంతోషంగా ఉంది. ఎందుకంటే త్వరలో జరిగే ఐపీఎల్ పదో సీజన్‌లోనైనా మా జట్టు కింగ్స్ ఎలెవన్ పంజాబ్, పూణెను ఓడించగలదని ఆశిస్తున్నా' అని ఓ కార్యక్రమంలో పాల్గొన్న సెహ్వాగ్ సరదా వ్యాఖ్యలు చేశాడు.

నిజానికి ధోనిని కెప్టెన్సీ నుంచి తప్పించడం అనేది ఆ ఫ్రాంచైజీకి సంబంధించిన ఆంతరంగిక విషయమని, కానీ భారత్‌కు నాయకత్వం వహించిన అత్యుత్తమ కెప్టెన్లలో ధోని ఒకడని ప్రశంసించాడు. 2008లో ఐపీఎల్ ప్రారంభమైనప్పటి నుంచి ధోని కెప్టెన్‌గానే కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఎనిమిది సీజన్లు చెన్నైకి, ఒక సీజన్ పూణె జట్టుకి అతడు కెప్టెన్సీ వహించాడు.
తొలిసారి ఓ సాధారణ క్రికెటర్‌గా ఐపీఎల్ పదో సీజన్‌లో ధోని బరిలోకి దిగుతుండటం విశేషం. గత సీజన్లో 14 మ్యాచుల్లో కేవలం ఐదింట్లోనే పూణె గెలవడంతో ఆ జట్టు మేనేజ్‌మెంట్‌ను ధోనీని కెప్టెన్సీ నుంచి తప్పించి ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్‌కు ఆ బాధ్యతలను అప్పగించింది.