హైదరాబాద్: ప్రస్తుతం జరుగుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో కామెంటేటర్‌గా వ్యవహరిస్తోన్న ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్‌ను టీమిండియా వెటరన్ క్రికెటర్ యువరాజ్ సింగ్ సోషల్ మీడియాలో ఆటపట్టించాడు.
స్వతహాగా వీరిద్దరూ మంచి స్నేహితులు. అంతేకాదండోయ్ మంచి హాస్యప్రియులు కూడా. ట్విట్టర్‌లో ఈ ఇద్దరూ ఒకరిపై మరొకరు సెటైర్లు వేసుకుని అభిమానుల్ని తెగ నవ్వించారు. తొలుత ఏప్రిల్ 10న 'ఆ పసుపు రంగు సాక్సుల్లో కత్తిలా (షార్ప్) ఉన్నావు కెవిన్. కుశలమేనని అనుకొంటున్నా! పైచుకర్' అని యువరాజ్ ట్వీట్ చేశాడు.
ఈ ట్వీట్‌కు బదులుగా 'నిన్ను ప్రేమిస్తా! కానీ నీ బౌలింగ్‌ను కాదు' అంటూ పీటర్సన్ సరదాగా బదులిచ్చాడు. పీటర్సన్ సమాధానానికి నవ్వకుండా ఉండలేకపోయిన యువరాజ్ దానికి బదులుగా నవ్వుతూ ట్వీట్‌ని పోస్టు చేశాడు.
గతంలో ఈ ఇద్దరూ చాలా మ్యాచ్‌ల్లో ఒకరిని మరొకరు ఎదుర్కొన్న సందర్భాలు అనేకం. పీటర్సన్‌కు ఎడమచేతి వాటం స్పిన్నర్లను ఎదుర్కొనేందుకు ఎప్పుడూ ఇబ్బంది పడేవాడు. ఈ క్రమంలో చాలాసార్లు యువరాజ్ అతడి వికెట్ తీశాడు. అందుకే 'నీ బౌలింగ్‌ను కాదు' అని సమాధానమిచ్చాడు.
యువీని కెవిన్ పైచుకర్ అని పిలుస్తుంటాడు. ఇలా ఐపీఎల్‌లో వీరిద్దరి మధ్య చోటు చేసుకున్న సరదా సంభాషణ పట్ల అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.