హైదరాబాద్: క్రికెట్ అభిమానులు ఎప్పడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 10వ ఎడిషన్ ట్రోఫీ టూర్ మొదలైంది. శుక్రవారం చంఢీగఢ్ నుంచి ఢిల్లీ చేరుకున్న ట్రోఫీని శనివారం ఉదయం ఎర్రకోట వద్ద ప్రదర్శనకు ఉంచారు.
ఢిల్లీలోని ఎర్రకోట వద్ద ఐపీఎల్ 10 ఛాంపియన్స్ అందుకోబోయే ట్రోపీ సందడి చేసింది. ఈ సందర్భంగా బాలీవుడ్ నటి సుర్వీన్ చావ్లా ట్రోఫీ వద్ద సెల్ఫీలు దిగుతూ సందడి చేసింది. ఎర్రకోట వద్ద ట్రోఫీతో దిగిన సెల్ఫీలను చోప్రా తన ట్విట్టర్‌లో పోస్టు చేసింది.
అనంతరం ఐపీఎల్ ట్రోఫీని ఢిల్లీలోని సిటీ వాక్ మాల్‌లో ప్రదర్శనకు ఉంచారు. అభిమానుల కోసం నిర్వాహకులు దేశవ్యాప్తంగా మార్చి 10 నుంచి 31 వరకు దేశంలోని 16 ప్రధాన నగరాల్లో ఐపీఎల్ ట్రోఫీని ప్రదర్శనకు ఉంచుతున్నారు. ఇందులో భాగంగానే శనివారం ఐపీఎల్ ట్రోఫీ ఢిల్లీకి చేరుకుంది.
ఢిల్లీ తర్వాత మార్చి 13న ట్రోఫీ బెంగళూరుకు చేరుకోనుంది. చివరగా మార్చి 31న పూణెలో ఐపీఎల్ ట్రోఫీ పర్యటన ముగియనుంది. ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్‌గా వివో వ్యవహరిస్తోంది. ఏప్రిల్ 5న హైదరాబాద్‌లో ఐపీఎల్ ప్రారంభం కానుంది. ఈ సీజన్‌లో తొలి మ్యాచ్‌లో భాగంగా డిఫెండింగ్ ఛాంపియన్ సన్‌రైజర్స్ హైదరాబాద్, రన్నర్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడనుంది.
ఈ మ్యాచ్ ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఏప్రిల్ 5న జరగనుంది. ఇదే స్టేడియంలో మే 21న ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. దేశవ్యాప్తంగా 10 వేదికల్లో 47 రోజులపాటు మొత్తం 60 మ్యాచ్‌లను నిర్వహించనున్నట్లు బీసీసీఐ తెలిపింది. ప్రతి జట్టు 14 మ్యాచ్‌లను ఇతర జట్లతో ఆడాల్సి ఉంటుంది.
అందులో 7 మ్యాచ్‌లు సొంత మైదానం ఆతిథ్యమిస్తుంది. క్వాలిఫయర్స్, ఎలిమినేటర్స్ వేదికలను ఇంకా నిర్ణయించలేదు. మరోవైపు కింగ్స్ లెవన్ పంజాబ్ తమ రెండో హోమ్ గ్రౌండ్‌గా ఇండోర్‌ను ఎంపిక చేసుకుంది.