హైదరాబాద్: ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియంలో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ చేతిలో ఓటమికి తానే కారణమని బెంగళూరు రాయల్ చాలెంజర్స్ జట్టు తాత్కాలిక కెప్టెన్ షేన్ వాట్సన్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఓటమి బాధ్యతను వాట్సన్ తనపై వేసుకున్నాడు.
మ్యాచ్ అనంతరం వాట్సన్ మీడియాతో మాట్లాడాడు. ఓటమికి తనదే బాధ్యత అంటూ తనను తాను నిందించుకున్నాడు. 'నేను బాగా బ్యాటింగ్ చేయలేదు. మొదటి ఓవర్‌లోనే నేను అవుటయ్యాను. కాబట్టి నన్ను నేను నిందించుకోక తప్పదు' అని వాట్సన్ అన్నాడు.

అంతేకాదు తమ జట్టు కనీసం 170-180 పరుగులు చేసి ఉంటే మ్యాచ్ ఫలితం మరోలా ఉండేదని వాట్సన్ అన్నాడు. సోమవారం రాత్రి జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో పంజాబ్ జట్టు ఎనిమిది వికెట్ల తేడాతో బెంగళూరుపై ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే.
22 పరుగులకు మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న బెంగళూరును 360 డిగ్రీల ఆటగాడు డివిలియర్స్ తన విధ్వంసకర బ్యాటింగ్‌తో ఆదుకున్నాడు. సుడిగాలి అద్భుతమైన ఇన్నింగ్స్‌తో 46 బంతుల్లో 3 ఫోర్లు, 9 సిక్సుల సాయంతో 89 పరుగులు చేశాడు.
దీంతో బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లకు 148 పరుగులు మాత్రమే చేయగలిగింది. అనంతరం 149 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ ఓపెనర్ హషీమ్ ఆమ్లా (58), గ్లెన్ మాక్స్‌వెల్ (43) రాణించడంతో మరో 33 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని చేధించింది.
ఈ సీజన్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌కు వరుసగా ఇది రెండో విజయం. వరుసగా రెండు విజయాలతో ఊపుమీదున్న పంజాబ్ కెప్టెన్ గ్లెన్ మాక్స్‌వెల్ మాట్లాడుతూ తమ విజయం క్రెడిట్ బౌలర్లదేనని ప్రశంసలు కురిపించాడు.