హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 10వ సీజన్‌లో భాగంగా ఆదివారం నాడు కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో నిబంధనలను ఉల్లంఘించినందుకు ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ మందలింపుకు గురయ్యాడు. అంపైర్ నిర్ణయంపై రోహిత్ శర్మ అసంతృఫ్తి వ్యక్తం చేయడంతో మ్యాచ్ రిఫరీ అతడిని తీవ్రంగా మందలించాడు.
ముంబైలోని వాంఖడె వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ముంబై 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆటలో భాగంగా పదో ఓవర్‌లో సునీల్ నరైన్ బౌలింగ్‌లో రోహిత్ శర్మ ఎల్బీడబ్ల్యూగా అవుటయ్యాడు. ఈ సమయంలో ఫీల్డ్ అంఫైర్ సీకే నందన్ నిర్ణయంపై రోహిత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు.

అంపైర్ వైపు తన బ్యాట్‌ని చూపిస్తూ రోహిత్ శర్మ అసంతృప్తిగా మైదానాన్ని వీడాడు. కేవలం 2 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రోహిత్ శర్మ పెవిలియన్‌కు చేరాడు. దీంతో ఐపీఎల్ నిబంధనలను ఉల్లంఘించినందుకు అతడిపై నిర్వాహకులు నిర్ణయం తీసుకున్నారు.
'ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిని రోహిత్ శర్మ ఉల్లంఘించాడు. క్రీడాస్ఫూర్తికి విరుద్ధంగా ఉన్న అతడి ప్రవర్తన నియమావళిలో లెవల్ 1 నేరం కిందకు వస్తుండటంతో మ్యాచ్ రిఫరీ మందలించారు' అని ఐపీఎల్ నిర్వాహక కమిటీ ఒక ప్రకటనలో తెలిపింది.
ఈ మ్యాచ్‌లో కోల్‌కతాపై నాలుగు వికెట్ల తేడాతో ముంబై అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లకు 178 పరుగులు చేసింది. మనీశ్ పాండే (47 బంతుల్లో 81 నాటౌట్; 5 ఫోర్లు, 5 సిక్సర్లు) రాణించారు. అనంతరం 179 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై 19.5 ఓవర్లలో ఆరు వికెట్ల కోల్పోయి 180 పరుగులు చేసింది.