హైదరాబాద్: భారత్‌లో క్రికెట్ అనేది ఓ మతం. భారతీయలు క్రికెట్‌ను ఎంతగా ప్రేమిస్తారో దేశాన్ని కూడా అంతే ప్రేమిస్తారు. అలాంటి క్రికెట్‌లో భాగమైన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో పాకిస్థాన్ ఆటగాళ్లకు ఆడే అవకాశమివ్వండని బాలీవుడ్ సీనియర్ నటుడు రిషి కపూర్ కోరుతున్నాడు.
ప్రపంచంలోని మిగతా దేశాల క్రికెటర్ల ప్రతిభను నిరూపించుకునేందుకు అవకాశమిచ్చినట్లే పాకిస్థాన్ ఆటగాళ్లను కూడా అనుమతిస్తే బాగుంటుందని కపూర్ అభిప్రాయపడ్డాడు. బుధవారం ఐపీఎల్ 10వ సీజన్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రిషి కపూర్ ట్విటర్‌లో తన సందేశాన్ని పోస్టు చేశాడు.
'ఐపీఎల్ ద్వారా చాలా మంది యువ క్రికెటర్ల ప్రతిభ వెలుగులోకి వస్తున్నది. ఈ సీజన్‌లో ఆఫ్ఘనిస్థాన్ ఆటగాళ్లు కూడా అరంగేట్రం చేశారు. కావున దయచేసి పాకిస్ధాన్ ఆటగాళ్లకు ఆడే అవకాశమివ్వండి' అంటూ రిషి కపూర్ ట్విట్ చేశాడు. యూరీ ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్ స్టార్లను బాలీవుడ్ నుంచి బహిష్కరించిన సంగతి తెలిసిందే.
అయితే రిషి కపూర్ ట్విటర్ వ్యాఖ్యలపై నెటిజన్లు మండిపడుతున్నారు. కాగా, బుధవారం హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో ఐపీఎల్ ప్రారంభ వేడుకలు ఘనంగా ప్రారంభం కావడంతో పాటు సన్ రైజర్స్ హైదరాబాద్, బెంగళూరు జట్ల మధ్య తొలి మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో హైదరాబాద్ విజయం సాధించిన సంగతి తెలిసిందే.