ఇండోర్: మహేంద్ర సింగ్ ధోనీ భారత్ తరపున మరో రికార్డు సృష్టించాడు. ఐపీఎల్ 10లో భాగంగా శనివారం కింగ్స్ లెవన్ పంజాబ్ జట్టుతో జరుగుతున్న మ్యాచ్‌లో రైజింగ్ పుణె సూపర్‌జెయింట్స్ జట్టు తరపున ఆడుతున్న ధోనీ.. భారత్ తరపున అత్యధిక టీ20 మ్యాచులు ఆడిన ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు.
ఇండోర్‌లోని హోళ్కర్ స్టేడియంలో జరుగుతన్న ఈ మ్యచ్ ధోనీకి 250వది. ఇన్ని మ్యాచ్ లు ఆడిన తొలి భారత ఆటగాడు ధోనీయే కావడం గమనార్హం. ధోనీ తర్వాత స్థానం సురేష్ రైనా 246 (మ్యాచ్‌లు) ఉన్నాడు. అయితే, శనివారం పంజాబ్‌తో జరిగుతున్న మ్యాచ్‌లో కేవలం 5 పరుగులు చేసిన ధోనీ ఔటయ్యాడు.

ఈ 35ఏళ్ల వికెట్ కీపర్, బ్యాట్స్‌మన్ 2006లో సౌతాఫ్రికా జట్టుతో జోహన్నెస్ బర్గ్‌లో జరిగిన టీ20 మ్యాచ్‌తో అరంగేట్రం చేశాడు. 249 టీ20 మ్యాచ్‌ల్లో మొత్తం 5,063 పరుగులు చేశాడు ధోనీ. కాగా, ధోనీ కెప్టెన్సీలోనే 2007లో సౌతాఫ్రికాలో జరిగిన టీ20 ప్రపంచ కప్‌ను భారత్ సాధించిన విషయం తెలిసిందే.
ఐపీఎల్‌లో కూడా ధోనీ విజయవంతమైన కెప్టెన్ గా పేరు తెచ్చుకున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు కెప్టెన్సీ వహించిన ధోనీ.. 2010, 2011సంవత్సరాల్లో వరుసగా రెండు టైటిళ్లను అందించాడు. ఛాంపియన్స్ లీగ్(సీఎల్టీ20) ట్రోఫీని కూడా 2010, 2014లలో సాధించిపెట్టాడు. అవినీతి ఆరోపణల నేపథ్యంలో రెండేళ్ల నిషేధం ఎదుర్కొంటున్న చెన్నై సూపర్‌కింగ్స్ జట్టు వచ్చే ఏడాది ఐపీఎల్‌లో పాల్గొంటుంది.
భారత్ తరపున టీ20 మ్యాచ్‌లు అత్యధికంగా ఆడిన ఆటగాళ్లు(ఏప్రిల్ 8, 2017 వరకు)
250-ధోనీ
246-సురేష్ రైనా
237-రోహిత్ శర్మ
221-గౌతమ్ గంభీర్
218-హర్భజన్ సింగ్, యూసుఫ్ పఠాన్