హైదరాబాద్: మహేంద్ర సింగ్ ధోని... భారత క్రికెట్‌లో పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. అతని సారథ్యంలో టీమిండియా ఎన్నో గొప్ప విజయాలను సాధించింది. ఐపీఎల్‌లో తన కెప్టెన్సీలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుని వరుసగా రెండు సార్లు ఛాంపియన్‌గా నిలిపాడు.
మ్యాచ్ ఫిక్సింగ్ కారణంగా ఆ జట్టు రెండేళ్ల పాటు నిషేధానికి గురి కావడంతో గతేడాది రైజింగ్ పూణె సూపర్ జెయింట్‌కు కెప్టెన్‌గా వ్యవహరించాడు. అయితే గత సీజన్ పూణె జట్టు పెద్దగా విజయాలను నమోదు చేయలేదు. 14 మ్యాచ్‌లాడిన పూణె 5 గెలిచి తొమ్మిందింట్లో ఓటమి పాలైంది.
దీంతో గత సీజన్‌లో పూణె పాయింట్ల పట్టికలో చివరి నుంచి రెండో స్ధానానికి పరిమితమైంది. దీంతో ఐపీఎల్ పదో సీజన్ ప్రారంభానికి ముందు ధోనిని కెప్టెన్సీ నుంచి అతడి స్ధానంలో ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్‌ను కెప్టెన్‌గా నియమించింది ప్రాంజైజీ. ప్రస్తుత సీజన్‌లో ధోని ఆశించిన మేరకు రాణించడం లేదు.

ఇప్పటివరకు పూణె ఆడిన మూడు మ్యాచ్‌ల్లో ధోనీ తక్కువ స్కోర్లకే పరిమితమయ్యాడు. మూడు మ్యాచ్‌లలో ధోని కేవలం 28 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో కెప్టెన్సీ నుంచి తొలగించడం వల్లే ధోని అలా ఆడుతున్నాడని సోషల్ మీడియాలో విమర్శలు వచ్చాయి.
పుణె జట్టు యాజమాన్యం కూడా ధోని ఆటతీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఐపీఎల్ 10వ సీజన్ ప్రారంభమైన తర్వాత పూణె టీమ్ యజమాని సంజీవ్ గోయెంకా సోదరుడు హర్ష్ గోయెంకా ధోనీపై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో ధోని అభిమానులు పూణె యాజమాన్యంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ప్లేయర్‌గా ధోని ఆటతీరుపై అవమానకరంగా మాట్లాడిన పూణె యాజమాన్యానికి గట్టి షాక్ ఇవ్వాలనే ఉద్దేశంతో ట్విట్టర్‌లో #WeStandByDhoni అంటూ పెద్ద ఎత్తున ధోనికి మద్దతుగా ట్వీట్స్ చేస్తున్నారు.