హైదరాబాద్: పూణె వేదికగా రైజింగ్ పూణె సూపర్ జెయింట్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య జరిగిన ఉత్కంఠ మ్యాచ్‌లో పూణె 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ సీజన్‌లో తనపై చేస్తున్న విమర్శకులకు ధోని తన బ్యాట్ తోనే సమాధానం చెప్పాడు. చివరి బంతికి రెండు పరుగులు చేయాల్సిన సమయంలో పూణె ఆటగాడు ధోని ఫోర్ కొట్టి జట్టుకు విజయాన్ని అందించాడు.
ఈ మ్యాచ్‌లో ధోని 5 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 69 పరుగులు చేసి జట్టుని విజయ తీరాలకు చేర్చాడు. 177 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన పూణెకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ రహానే (2) వికెట్ కోల్పోయింది. అనంతరం క్రీజులోకి వచ్చిన స్మిత్, త్రిపాఠితో కలిసి నిలకడగా ఆడుతూ పరుగులు రాబట్టారు.

సిరాజ్ వేసిన 5 ఓవర్ తొలి బంతికి రాహుల్ త్రిపాఠి ఇచ్చిన క్యాచ్‌ను బిపుల్ శర్మ మిస్ చేశాడు. దీనిని ఆసరాగా చేసుకుని త్రిపాఠి సిరాజ్ బౌలింగ్‌లో సిక్స్, ఫోర్‌తో చెలరేగాడు. ఈ ఓవర్‌లో మొత్తం 13 పరుగులు రాబట్టాడు. ఇలా 32 బంతుల్లో త్రిపాఠి అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ క్రమంలో 11 ఓవర్లో తన అద్భుతమైన బంతితో స్మిత్‌ను పెవిలియన్‌కు చేర్చాడు.
దీంతో వీరద్దరి 72 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. అనంతరం క్రీజులోకి వచ్చిన ధోని ఆచి తూచి ఆడాడు. ఈ సమయంలో 14 ఓవర్లలో త్రిపాఠి (59) పరుగుల వద్ద రషీద్ విసిరిన త్రోకు రనౌట్ అయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన బెన్ స్టోక్స్ అవుట్ కావడంతో మ్యాచ్ సన్ రైజర్స్ చేతిలోకి వచ్చింది. చివర్లో సిరాజ్ వేసిన 18 ఓవర్లో ధోని వరుస బంతుల్లో సిక్సర్, ఫోర్‌తో రాణించడంతో మ్యాచ్ ఉత్కంఠంగా మారింది.
భువనేశ్వర్ వేసిన 19 ఓవర్లలో వరుస బంతులను ధోని బౌండరికి తరలించి, సిక్స్ కొట్టడంతో 19 పరుగులు వచ్చాయి. చివరి ఓవర్లో పూణె విజయానికి 13 పరుగులు కావల్సి ఉండగా చివరి బంతి వరకు ఉత్కంఠ కొనసాగింది. చివరి బంతిని ధోని ఫోర్ బాదడంతో పూణె 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
హైదరాబాద్ Vs పూణె మ్యాచ్ హైలెట్స్:
* చివరి బంతిని ధోని ఫోర్ బాదడంతో పూణె 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
* పూణె విజయానికి ఒక బంతికి రెండు పరుగులు చేయాల్సిన తరుణంలో ధోని ఫోర్ కొట్టాడు.
* చివరి రెండు ఓవర్లలో పూణె విజయానికి 30 పరుగులు కావల్సి ఉంది.
* భువనేశ్వర్ వేసిన 19 ఓవర్లలో వరుస బంతులను ధోని బౌండరికి తరలించి, సిక్స్ కొట్టడంతో 19 పరుగులు వచ్చాయి.
* 61 పరుగులతో నాటౌట్‌గా నిలిచిన ధోనికి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.
* పూణె ఓపెనర్ రాహుల్ త్రిపాఠి ఐపీఎల్ పదో సీజన్‌లో తొలిసారి అర్ధసెంచరీని చేశాడు. 41 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సుల సాయంతో 59 పరుగులు చేశాడు.
* చివరి 5 ఓవర్లలో పూణె విజయానికి 62 పరుగులు కావాల్సి వచ్చింది. చేతిలో 7 వికెట్లు ఉన్నాయి. క్రీజులో ధోని, స్టోక్స్ ఉన్నారు.
* ఈ మ్యాచ్‌లో 17 ఏళ్ల ఆఫ్ స్పిన్నర్ వాష్టింగ్టన్ సుందర్ ఐపీఎల్ అరంగేట్రం చేశాడు. రవిచంద్రన్ అశ్విన్ స్ధానంలో పూణె ప్రాంఛైజీ చివర్లో జట్టులోకి తీసుకుంది.
* సన్ రైజర్స్ హైదరాబాద్ 6 ఓవర్ల పవర్ ప్లేలో వికెట్ నష్టపోకుండా 45 పరుగులు చేసింది.
* గుజరాత్ లయన్స్ ఆటగాడు బ్రెండన్ మెక్ కల్లమ్ నుంచి సన్ రైజర్స్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ ఆరెంజ్ క్యాప్‌ని తిరిగి సొంతం చేసుకున్నాడు.
* ఈ మ్యాచ్‌లో సన్ రైజర్స్ ఆటగాడు హెన్రిక్స్ 28 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సులతో 55 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.
* ఈ మ్యాచ్‌లో సన్ రైజర్స్ ఆటగాళ్లు 17 ఫోర్లు, 5 సిక్సులు బాదారు.
* పూణె బౌలర్లలో డేనియల్ కిరెస్టెన్ 4 ఓవర్లు వేసి ఒక వికెట్ తీసి 20 పరుగులిచ్చాడు.
* చివరి 5 ఓవర్లలో సన్ రైజర్స్ వికెట్ నష్టపోయి 63 పరుగులు చేసింది.