హైదరాబాద్: ఐపీఎల్ మ్యాచ్‌లో భాగంగా చిన్నస్వామి స్టేడియంలో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆటగాళ్లు గ్రీన్ జెర్సీతో మైదానంలోకి అడుగుపెట్టారు. అదేంటి సీజన్ ఆరంభం నుంచి ఎరుపు, నలుపు కాంబినేషన్‌లో ఉన్న జెర్సీని ధరించిన బెంగళూరు సడన్‌గా డ్రస్ కోడ్‌ని ఎందుకు మార్చాందా? అని క్రికెట్ అభిమానులు అనుకుంటున్నారు.
ఐపీఎల్ ప్రత్యేక వార్తలు | ఐపీఎల్ పాయింట్ల పట్టిక | ఐపీఎల్ 2017 ఫోటోలు
అయితే దీని వెనుక పెద్ద కథే ఉంది. పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించడం కోసం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకుంది. ఆదివారం బెంగళూరు ఆటగాళ్లు ధరించిన జెర్సీని గతంలో చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్‌ను వీక్షించేందుకు వచ్చినప్పుడు అభిమానులు వదిలివేసిన ప్లాస్టిక్ సీసాలను సేకరించి వాటిని రీసైక్లింగ్ చేయడం ద్వారా వచ్చిన ఉత్పత్తులతో ఈ గ్రీన్ జెర్సీలను తయారు చేశారు.
సుమారు పదకొండు వేల బాటిళ్లను ఉపయోగించి ఈ జెర్సీలను తయారు చేశారు. 2011 సీజన్ నుంచి గ్రీన్ జెర్సీనీ ధరించి 'గో గ్రీన్' కార్యక్రమం పేరుతో గ్లోబల్ వార్మింగ్‌పై అవగాహన కల్పించేందుకు ప్రతి ఏడాది ఆర్‌సీబీ యాజమాన్యం ప్రయత్నాలు చేస్తోన్న సంగతి తెలిసిందే.
ఇందులో భాగంగా గతంలో చెట్లు నాటడం, వ్యక్తిగత వాహనాల కన్నా బస్సుల్లో ప్రయాణించి ఇంధనాన్ని ఆదా చేయాలనే పలు కార్యక్రమాలను చేపట్టింది. ఆదివారం కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్ బెంగళూరుకు ఈ సీజన్‌లో చివరి మ్యాచ్ కావడం విశేషం.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు 158 పరుగులు చేసింది. అనంతరం సునీల్ నరైన్ (17 బంతుల్లో 54; 6 ఫోర్లు, 4 సిక్సులు), క్రిస్ లిన్ (22 బంతుల్లో 50; 5 ఫోర్లు, 4 సిక్సులు) చెలరేగిపోవడంతో 159 పరుగుల లక్ష్యాన్ని కోల్‌కతా 15.1 ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది.
ఈ విజయంతో కోల్‌కతా పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి ఎగబాకింది. 12 మ్యాచ్‌ల్లో ఆ జట్టుకిది 8వ విజయం కావడం విశేషం. ఈ మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ ప్రదర్శన చేసిన నరైనే 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్'గా నిలిచాడు. ఇక బెంగళూరు 5 పాయింట్లతో ఆఖరి స్ధానంలో ఉంది.