హైదరాబాద్: ఐపీఎల్ తొలి మ్యాచ్‌లో విజయం తమదేనని సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ ధీమా వ్యక్తం చేశాడు. బుధవారం ఉప్పల్ స్టేడియంలో జరగబోయే ప్రారంభోత్సవానికి సన్‌రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగే తొలి మ్యాచ్‌కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా డేవిడ్ వార్నర్ మీడియాతో మాట్లాడాడు.

టీ20 ఫార్మెట్‌లో శిఖర్ ధావన్ చాలా ప్రమాదకారి అని అతడు విధ్వసం మొదలుపెడితే సగం విజయం మాదేనని చెప్పాడు. యువరాజ్ సింగ్, భువనేశ్వర్, అశీస్ నెహ్రాలపై తనకు పూర్తిగా నమ్మకం ఉందని చెప్పాడు. కేన్ విలియమ్సన్, మోసెస్ హెన్రిక్స్, నమన్ ఓజా, దీపక్ హూడాలు సాధ్యమైనంత త్వరగా ఈ ఫార్మాట్లో రాణిస్తే సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు అద్బుత విజయాలు సాధిస్తుందని వార్నర్ చెప్పుకొచ్చాడు.
'గత సీజన్ ఫైనల్లో బెంగళూరును ఓడించడం నిజంగానే ఓ అద్భుతం. అయితే మొదట మేం చాంపియన్లం అనే విషయాన్ని జీర్ణించుకోవాలి. స్వల్ప స్కోర్లు చేసిన మ్యాచ్ లను శాసించాం. గతేడాది దిగిన బ్యాటింగ్ లైనప్‌తోనే బరిలోకి దిగుతాం. ఇంకా కొంత అదనపు బలం చేకూరింది. కుర్రాళ్లంతా ఎంతో ఉత్సాహంగా ఆట మొదలుపెట్టేందుకు సిద్ధంగా ఉన్నారు. గతేడాది ఫైనల్లో వచ్చిన ఫలితాన్ని ఈరోజు మ్యాచ్‌లో పునరావృతం చేస్తాం' అని వార్నర్ తెలిపాడు.
తొలి మ్యాచ్‌కు ముందు ప్రారంభ వేడుకలను ఘనంగా జరగనున్నాయి. సాయంత్రం 6.30 గంటలకు జరిగే ఈ వేడుకల్లో బాలీవుడ్ ముద్దుగుమ్మ అమీ జాక్సన్ తన డ్యాన్స్‌తో సందడి చేయనుంది. ఆరు నిమిషాలపాటు జరిగే ప్రదర్శనలో అమీ స్టేజ్‌ను హీటెక్కించనుంది. బాలీవుడ్ హిట్ సాంగ్స్ తమ్మ తమ్మ, లెట్స్ నాచో, కర్ గయీ చుల్లా, కాలా చష్మా లాంటి పాటలకు డ్యాన్స్ చేయనుంది.
మంగళవారం ఆమె రిహార్సల్స్ కూడా చేసింది. మూడు వందల మంది కళాకారులతో కలిసి అమీ జాక్సన్ సందడి చేయనుంది. రాష్ట్ర సంస్కృతిని తెలిపే నృత్య రూపకాలను ప్రదర్శించే అవకాశం ఉంది. కాగా, ఓవరాల్‌గా ఉప్పల్‌లో 21 నిమిషాల పాటు ఆరంభ వేడుకలు నిర్వహిస్తున్నారు.