హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 10వ సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తోన్న ఏబీ డివిలియర్స్‌పై గుజరాత్ లయన్స్ జట్టు ఆటగాడు మెక్ కల్లమ్ జోక్ వేశాడు. బుధవారం సాయంత్రం జరిగే తొలి మ్యాచ్‌కు డివిలియర్స్ దూరమైన సంగతి తెలిసిందే.
అదేవిధంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తాత్కాలిక కెప్టెన్‌గా నియమితుడైన షేన్ వాట్సన్‌కు, ఆర్సీబీ జట్టుకు శుభాకాంక్షలు తెలిపాడు. డివిలియర్స్ ట్వీట్‌పై గుజరాత్ లయన్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తోన్న మెక్‌కల్లమ్ ట్విట్టర్ ద్వారా స్పందించాడు.
ఐపీఎల్ తొలి మ్యాచ్ ఆడలేకపోతున్నందుకు బాధపడకు వీలైతే ఆర్సీబీ జట్టు కోచ్ బాధ్యతలు స్వీకరించి ఆ స్థానంలో ఉన్న డానియల్ వెటోరీని క్రీజులోకి పంపు అంటూ జోక్ చేశాడు. డివిలియర్స్ వెన్ను నొప్పితో బాధపడుతున్నట్లు దక్షిణాఫ్రికా క్రికెట్ ట్వీట్ చేయడంతో సన్ రైజర్స్ హైదరాబాద్‌తో జరిగే ఆరంభ మ్యాచ్‌లో డివిలియర్స్ పాల్గొనడం లేదు.
అతని స్థానంలో ఆసీస్ ఆల్ రౌండర్ షేన్ వాట్సన్‌కు కెప్టెన్‌గా బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు మంగళవారం ఆర్‌సీబీ అధికారిక ప్రకటన చేసింది. ఆర్‌సీబీ జట్టులో కోహ్లీ, డివిలియర్స్‌లు గైర్హాజరీ అయితే వారి స్థానాన్ని వాట్సన్ భర్తీ చేయనున్నట్లు కోచ్ వెటోరి తెలిపాడు. ప్రస్తుతం గాయంతో బాధపడుతున్న డివిలియర్స్ కోలుకోవడానికి మరికొంత పడుతుందని చెప్పాడు.
లోయర్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ సర్ఫరాజ్ ఖాన్ కూడా ఐపీఎల్‌కి దూరమయ్యాడు. సోమవారం బెంగళూరు జట్టు ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో మైదానంలో ప్రమాదవశాత్తూ సర్ఫరాజ్ పడిపోయాడు. దీంతో అతడి కాలుకి బలంగా గాయమైంది. వెంటనే ఫిజియో, వైద్య సిబ్బంది సర్ఫరాజ్‌ను మైదానం వెలుపలికి తీసుకువెళ్లి ప్రథమ చికిత్స చేశారు.
అనంతరం ఫిజియో విశ్రాంతి సూచించడంతో సర్ఫరాజ్ ఐపీఎల్‌కి దూరమైనట్లు బెంగళూరు జట్టు ప్రకటించింది. బుధవారం నుంచి ఐపీఎల్‌లో మ్యాచ్‌లు ప్రారంభంకానున్నాయి. డిఫెండింగ్ ఛాంపియన్ సన్ రైజర్స్ హైదరాబాద్, రన్నరప్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య తొలి మ్యాచ్ జరగనుంది.