హైదరాబాద్: తన క్రికెట్ కెరీర్ నాశనం కావడానికి టీమిండియా మాజీ కోచ్ గ్రెగ్ చాపెల్ ఎంతమాత్రం కారణం కాదని టీమిండియా ఆల్ రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ పేర్కొన్నాడు.
ఐపీఎల్ ప్రత్యేక వార్తలు | ఐపీఎల్ పాయింట్ల పట్టిక | ఐపీఎల్ 2017 ఫోటోలు
'నా కెరీర్ ఒక్కసారిగా నాశనం కావడం ఊహించింది కాదు. అది అలా జరిగిపోయింది. నా కెరీర్ నాశనం కావడానికి గ్రెగ్ చాపెల్ అని చాలా మంది అనుకుంటారు. అది నిజం కాదు. ఏ ఒక్కరు ప్రమేయంతో మన కెరీర్ నాశనం కాదు. . నీ జీవితంలో ఏమి జరిగినా దానికి నీవే బాధ్యుడివి. అంతేకానీ వేరే వారు ఎప్పుడు కారణం కాదు' అని పఠాన్ అన్నాడు.
'మనం చేయాల్సింది ఏదైతే ఉందో అది సక్రమంగా చేయడమే మన కర్తవ్యం. అలాగే నా కెరీర్ పతనం విషయంలో కూడా చాపెల్ కారణం కాదు. నేను ఎప్పుడైతే జట్టులో స్థానం కోల్పోయానో, అప్పుడు గాయాలు కూడా బాధించాయి. దాంతో తిరిగి జట్టులోకి పునరాగమనం చేయడం కష్టమైంది. నా కెరీర్ నాశనం కావడానికి కారణం గాయాలే' అని పఠాన్ పేర్కొన్నాడు.

ఐపీఎల్ పదో సీజన్‌లో గుజరాత్ లయన్స్ జట్టు తరుపున ఇర్ఫాన్ పఠాన్ బరిలోకి దిగుతున్నాడు. గాయం కారణంగా వెస్టిండీస్ ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రావో దూరం కావడంతో అతని స్థానంలో ఇర్ఫాన్ అనూహ్యంగా చోటు దక్కించుకున్నాడు.
ఈ ఏడాది ఫిబ్రవరిలో నిర్వహించిన ఐపీఎల్ వేలంలో ఇర్ఫాన్ పఠాన్‌ను కొనుగోలు చేసేందుకు ఏ ఫ్రాంచైజీ ఆసక్తి చూపలేదు. వేలంలో అతడి కనీస ధర రూ. 50 లక్షలుగా నిర్ణయించినా ఎవరూ కొనుగోలు చేసేందుకు ఆసక్తి కనబర్చలేదు. మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ నేతృత్వంలోని భారత జట్టులో ఇర్ఫాన్ కీలక సభ్యుడిగా ఎదుగుతూ వచ్చాడు.
అయితే ఉన్నట్టుండి ఇర్ఫాన్ పఠాన్ కెరీర్ ఒక్కసారిగా అథమస్థాయి పడిపోవడం, ఆ తర్వాత అతనికి అవకాశాలు లేకపోవడం చకాచకా జరిగిపోయాయి. ఈ క్రమంలో ఇర్ఫాన్ కెరీర్‌ను నాశనం కావడానికి ఒకప్పటి భారత జట్టు కోచ్ గ్రెగ్ చాపెల్ అని అప్పట్లో వార్తలు వచ్చాయి.