న్యూఢిల్లీ: టీమిండియా సీనియర్ ఆటగాడు గౌతమ్ గంభీర్ తన భావోద్వేగాలను నియంత్రించుకోలేడనే విషయం ఇప్పటికే దాదాపు అందరికీ తెలిసిపోయింది. ఎందుకంటే అతడు మైదానంలో అలా ఉంటాడు మరి. కానీ, అతను చేసే కొన్ని పనులు మాత్రం అందరూ మెచ్చుకునేవిగానే ఉంటాయి.
అసలు విషయానికొస్తే.. బెంగళూరు చిన్నస్వామి వేదికగా ముంబై ఇండియన్స్‌తో శుక్రవారం జరిగిన క్వాలిఫయర్-2లో నైట్‌రైడర్స్ ఓడిన తర్వాతా గంభీర్ భావోద్వేగానికి గురయ్యాడు. తన స్పందనను ట్విటర్‌లో అభిమానులతో పంచుకున్నాడు.
'కోల్‌కతా నైట్‌రైడర్స్ పట్ల మీ ఎనలేని ఆదరణకు వందనాలు. మీ అందరికీ చెప్పేదొకటే ఈ ప్రస్థానం ఒక సరదా కాదు. శక్తి వంచన లేకుండా పోరాడాం. అయితే మా అత్యుత్తమ పోరాటం సరిపోలేదనుకుంటున్నా' అని ట్వీట్ చేశాడు.
క్వాలిఫయర్-2 మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన గంభీర్ సేన 18.5 ఓవర్లకు 107 పరుగులకు ఆలౌటైంది. కర్ణ్‌శర్మ (4/16), బుమ్రా (3/7) ఆ జట్టును భారీ దెబ్బకొట్టారు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ముంబై 14.3 ఓవర్లకు 4 వికెట్ల నష్టపోయి లక్ష్యాన్ని ఛేదించింది.
క్రునాల్ పాండ్యా (45; 30 బంతుల్లో 8×4) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఐపీఎల్-10లో నైట్‌రైడర్స్ ప్రస్థానం ముగియడంతో గంభీర్ ట్విటర్‌లో అభిమానులకు కృతజ్ఞతలు తెలిపాడు. కాగా, ఐపీఎల్లో అత్యధిక అర్ధ శతకాలు బాదిన ఆటగాడిగా గంభీర్ రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే. అంతేగాక, మంచి ఫాంలో ఉన్న గంభీర్‌ను టీమిండియా జట్టకు ఎందుకు ఎంపిక చేయడం లేదంటూ పలువురు అభిమానులు బీసీసీఐపై ఆగ్రహం వ్యక్తం చేస్తుండటం గమనార్హం.