హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 10వ సీజన్ ఆరంభానికి ముందే ఆటగాళ్లు గాయాల బారిన పడుతున్నారు. ఐపీఎల్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్ జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తాజాగా గాయాల బారిన ఆటగాళ్ల జాబితాలోకి ఆ జట్టుకు చెందిన శ్రేయాస్ అయ్యర్ కూడా చేరాడు.
ఇప్పటికే ఢిల్లీకి చెందిన ఇద్దరు కీలక ఆటగాళ్లు ఐపీఎల్‌కు దూరమయ్యారు. ఇప్పుడు చికెన్ ఫాక్స్ కారణంగా శ్రేయాస్ అయ్యర్ కూడా దూరమవుతున్నట్లు ఢిల్లీ డేర్‌డెవిల్స్ యాజమాన్యం మంగళవారం అధికారిక ప్రకటన చేసింది. శ్రేయాస్ చికెన్ పాక్స్‌తో బాధపడుతుండటంతో కొన్ని మ్యాచ్‌లకు దూరమయ్యాడు.

అయితే శ్రేయాస్ తిరిగి ఎప్పుడు జట్టులోకి వచ్చే దానిపై ఇంకా స్పష్టత లేదు. భారత్‌తో ఆసీస్ టెస్టు సిరీస్ ప్రారంభానికి ముందు జరిగిన వార్మప్ మ్యాచ్‌లో అయ్యర్ డబుల్ సెంచరీ సాధించాడు. ఈ ప్రదర్శన ఆధారంగా ఆసీస్‌తో ముగిసిన చివరి టెస్టుకు శ్రేయాస్ అయ్యర్‌కు సెలక్టర్ల నుంచి పిలుపు వచ్చింది.
అయితే కొన్ని కారణాల వల్ల అతడికి తుది జట్టులో చోటు లభించలేదు. ఐపీఎల్‌కు ముందే దక్షిణాఫ్రికాకు చెందిన స్టార్ ఆటగాళ్లు జెపి డుమిని, క్వంటన్ డీకాక్ పాల్గొనడం లేదని ప్రకటించారు. వ్యక్తిగత కారణాలతో ఐపీఎల్‌లో పాల్గొనడంలేదని డుమిని ప్రకటించగా, న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టులో చేతి వేలి గాయం కారణంగా డీకాక్ ఐపీఎల్‌కి దూరమయ్యాడు.