హైదరాబాద్: ఐపీఎల్ పదో సీజన్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న డేవిడ్ వార్నర్ ఏమాత్రం విరామం దొరికినా తన కుటుంబంతో గడిపేందుకు ఇష్టపడుతున్నాడు. నిజం చెప్పాలంటే పదో సీజన్‌లో డేవిడ్ వార్నర్ బ్యాటింగ్ సక్సెస్‌కి కారణం కూడా అదే.
ఐపీఎల్ పదో సీజన్‌లో ఇప్పటివరకు 12 మ్యాచ్‌లాడిన డేవిడ్ వార్నర్ 535 పరుగులతో అగ్రస్ధానంలో కొనసాగుతున్నాడు. ఐపీఎల్‌లో ఎక్కువ పరుగులు చేసిన ఆటగాడికి ఇచ్చే ఆరెంజ్ క్యాప్‌ని సొంతం చేసుకున్నాడు. మైదానంలో ప్రత్యర్ధి జట్టు బౌలర్లపై విరుచుకుపడే వార్నర్ మైదానం బయట ఎంతో సాప్ట్‌గా ఉంటాడు.
ఈ విషయం సోషల్ మీడియాలో డేవిడ్ వార్నర్‌ను ఫాలో అయ్యే ప్రతి ఒక్కరికీ తెలుస్తోంది. ఐపీఎల్ పదో సీజన్ ప్రారంభ సమయంలో వార్నర్ తన భార్య క్యాండీ పాల్జన్, కుమార్తె ఐవీలతో కూడిన ఫోటోలను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్న సంగతి తెలిసిందే.
కాగా, ఐపీఎల్ ప్రారంభంలో వార్నర్ కుటుంబం అతనితో పాటు ఉండి తర్వాత స్వదేశానికి తిరిగి వెళ్లిపోయింది. అయితే ఇప్పుడు మళ్లీ తిరిగి హైదరాబాద్ చేరుకున్నారు. దీంతో ఐపీఎల్ మధ్యలో దొరికిన ఈ కాస్త విరామంలో కుటుంబంతో కలిసి సేదతీరుతున్నారు.
మంగళవారం రాత్రి హైదరాబాద్ నగరంలో ఉరుములు మెరుపులతో భారీ వర్షం కురిసింది. ఈ నేపథ్యంలో వార్నర్ తన కుమార్తె ఉరుముల శబ్దానికి.. మెరుపుల వెలుగుకు ఎలా భయపడుతుందో చూడండి అంటూ ఓ ఫోటోను అభిమానులతో పంచుకున్నారు.
పై అంతస్తులో ఉన్న వ్యక్తి ఎవరో తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్టు తన కుమార్తె భావించి ఉంటుందని సరాదాగా వ్యాఖ్యానించారు. ప్రస్తుతం సన్‌రైజర్స్ హైదరాబాద్ పాయింట్ల పట్టికలో 15 పాయింట్లతో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. శనివారం గుజరాత్ లయన్స్‌తో తలపడనుంది.