హైదరాబాద్: జూన్‌లో ప్రారంభం కానున్న ఛాంపియన్స్ ట్రోఫీలోనూ ఇదే జోరును కొనసాగిస్తామని సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ అన్నాడు. ఐపీఎల్ పదో సీజన్‌లో డేవిడ్ వార్నర్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్న సంగతి తెలిసిందే.
శుక్రవారం నగరంలోని క్రీడా ఉత్పత్తుల సంస్థ ఆసిక్స్ స్టోర్‌ను సన్‌రైజర్స్ ఆటగాడు కేన్ విలియమ్సన్‌తో కలిసి సందర్శించిన వార్నర్ అభిమానులతో కాసేపు ముచ్చటించారు. గత నాలుగు నెలలుగా మంచి ఫామ్‌లో ఉన్నానన్న చెప్పిన వార్నర్ చాంపియన్స్ ట్రోఫీలో కూడా రాణిస్తాననే నమ్మకం ఉందన్నాడు.

'నేను అనుకుంటున్నా. నా అత్యుత్తమ ప్రదర్శన చేస్తా. గత నాలుగు నెలలుగా మంచి ఫామ్‌లో ఉన్నా. అదే జోరుని కొనసాగించాలని అనుకుంటున్నా. నా కోసం కాకపోయినా, దేశం కోసమేనా ఇదే జోరుని కొనసాగిస్తా' అని వార్నర్ హైదరాబాద్‌లో పీటీఐతో అన్నాడు.
'ప్రపంచంలోని ఎనిమిది అత్యుత్తమ జట్లు పాల్గొనే చాంపియన్స్ ట్రోఫీలో ప్రతీ ఆటగాడు తన అత్యుత్తమ ఆటతీరును ప్రదర్శించాలనుకుంటాడు. నేను కూడా ఇదే జోరును అక్కడా కొనసాగిస్తా. చాంపియన్స్‌గా నిలవాలంటే ప్రతీ మ్యాచ్‌ను గెలవాల్సిందే. స్మిత్ సారథ్యంలోని మా జట్టు పటిష్టంగా ఉంది. ఆత్మవిశ్వాసంతో మేం టోర్నీని ప్రారంభిస్తాం' అని అన్నాడు.
ఇక ఐపీఎల్‌లో డేవిడ్ వార్నర్ సన్ రైజర్స్ కెప్టెన్ ఉన్నాడు. పదో సీజన్‌లో లీగ్ మ్యాచ్‌లు ముగిసే సరికి తమ జట్టు తొలిరెండు స్థానాల్లో నిలుపడమే తన ముందున్న లక్ష్యమని వార్నర్ చెప్పాడు. ప్రస్తుత సీజన్‌లో ఇప్పటివరకు పదకొండు మ్యాచ్‌లాడిన సన్ రైజర్స్ 6 మ్యాచ్‌ల్లో విజయం సాధించి, నాలుగింటి ఓటమి పాలైంది.
దీంతో ప్రస్తుతం పాయింట్ల పట్టికలో నాలుగో స్ధానంలో కొనసాగుతోంది. శనివారం సొంతగడ్డపై రైజింగ్ పూణె సూపర్ జెయింట్ జట్టుతో తలపడనుంది.