హైదరాబాద్: ప్రపంచంలోని అత్యుత్తమ వికెట్ కీపర్లలో ధోని ఒకడు. వికెట్ల వెనుకాల పాదరసం కంటే అత్యంత వేగంగా కదలగలడు. అలాంటి మహేంద్ర సింగ్ ధోని ఓ అరుదైన రికార్డుని అందుకున్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో వంద మందిని అవుట్ చేసిన వికెట్ కీపర్‌గా అరుదైన గుర్తింపు పొందాడు.
ఫిరోజ్ షా కోట్లా వేదికగా శుక్రవారం ఢిల్లీ డేర్ డెవిల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఉనాద్కత్ బౌలింగ్‌లో శ్రేయస్ అయ్యర్‌ను అవుట్ చేయడం ద్వారా ధోని ఈ ఘనత సాధించాడు. శ్రేయస్ అయ్యర్ ఇచ్చిన క్యాచ్ పట్టిన అనంతరం ధోని 'వంద' నం చేశాడు. 35 ఏళ్ల ధోని 156 ఐపీఎల్ మ్యాచుల్లో 71 క్యాచులు, 29 స్టంపింగ్స్ చేశాడు.

ఇదిలా ఉంటే ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో ధోని మరోసారి తన విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. డేనియల్ క్రిస్టియన్ బౌలింగ్‌లో మార్లోన్ శామ్యూల్స్‌ను ఆడిన బంతిని ఒంటి చేత్తో ధోని అందుకున్నాడు. దీంతో దూకుడుగా ఆడుతున్న శామ్యూల్స్ 14వ ఓవర్‌లో 27 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద నాలుగో వికెట్‌గా పెవిలియన్‌కు చేరాడు.
ఆ తర్వాత కాసేపటికే కోరె అండర్సన్‌ను రెప్పపాటులో స్టంపౌట్ చేసి పెవలియన్‌కి పంపాడు. వాషింగ్టన్ సుందర్ బౌలింగ్‌లో కాస్త ముందుకొచ్చి ఆడిన అండర్సన్.. క్రీజులో కాలు మోపేలోగానే ధోని వికెట్లను గిరాటేశాడు. దీంతో థర్డ్ అంపైర్ రివ్యూలో అవుట్ అని తేలడంతో ఆండర్సన్ నిరాశగా వెనుదిరిగాడు.
ఐపీఎల్‌లో వంద మందిని అవుట్ చేసిన ఘనత ధోని కంటే ముందు ప్రస్తుతం గుజరాత్ లయన్స జట్టు వికెట్ కీపర్ దినేష్ కార్తీక్ సాధించాడు. కాగా, ఐపీఎల్‌లో ఒక్క చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తరుపున ధోని 129 మ్యాచ్ లాడాడు. గత సీజన్ నుంచి రైజింగ్ పూణె సూపర్ జెయింట్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణల కారణంగా చెన్నై సూపర్ కింగ్స్‌తో పాటు రాజస్ధాన్ రాయల్స్ జట్లపై రెండేళ్ల పాటు నిషేధం విధించిన సంగతి తెలిసిందే.