హైదరాబాద్: ఐపీఎల్ 10వ సీజన్ కోసం నిర్వహించిన వేలంలో అత్యధిక ధర పలికిన ఆటగాడిగా బెన్ స్టోక్స్ రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. నిజానికి మైదానంలో ఆట కంటే వివాదాలతోనే ఎక్కువ వార్తల్లో నిలుస్తుంటాడు. మొట్టమొదటిసారి ఐపీఎల్‌లో ఆడుతున్నాడు.
ఈ ఏడాది వేలంలో అత్యధికంగా రూ.14.5 కోట్లు వెచ్చించి స్టోక్స్‌ని రైజింగ్ పుణె సూపర్ జైయింట్స్ ఫ్రాంఛైజీ కొనుగోలు చేసింది. ఐపీఎల్ 10వ సీజన్ కోసం బెన్ స్టోక్స్ పూణె జట్టులో గత వారమే చేరాడు. అయితే పుణె జట్టుతో ప్రయాణం చేస్తున్న క్రమంలో స్టోక్స్ తన సహచర ఆటగాడు దిండాతో విసుగుచెందాడంట.
ఇదే విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వివరించాడు. పూణె జట్టులోని బౌలర్ అశోక్ దిండా వింత వింత మనిషి అని.... అలాంటి వారిని చూసే హెడ్‌ఫోన్స్ కనిపెట్టారంటూ స్టోక్స్ తన ట్విటర్‌లో కామెంట్ చేశాడు. 'అశోక్ దిండా చాలా వింత మనిషి.. ఇలాంటి వారి కారణంగానే హెడ్‌ఫోన్స్ కనిపెట్టారు' అని స్టోక్స్ ఒక సెల్ఫీని జతచేసి ట్విటర్‌లో పోస్టు చేశాడు.
ఈ ఫొటోలో స్టోక్స్ చిరాకుతో ఉన్నట్లు కనిపించగా.. పక్కనే అశోక్ దిండా కొంటెంగా అతనిపైపు చూస్తూ ఉన్నాడు. బెన్‌స్టోక్స్ ఇది తొలి ఐపీఎల్ కాగా.. అశోక్ దిండా మాత్రం ఐపీఎల్ తొలి సీజన్ నుంచి ఏదో ఒక జట్టు తరుపున ఆడుతున్నాడు. అతను ఇప్పటికే చాలా జట్లు మారాడు. అయితే గతేడాది నుంచి రైజింగ్ పుణె సూపర్ జైయింట్ తరుపున ఆడుతున్నాడు.