హైదరాబాద్: సోమవారం బెంగుళూరులో జరిగిన ఐపీఎల్ వేలంలో టీమిండియా సీనియర్ బౌలర్ ఇషాంత్ శర్మను కొనుగోలు చేసేందుకు ఏ ఒక్క ప్రాంఛైజీ ఆసక్తి కనబర్చకపోవడంపై కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్ గౌతమ్ గంభీర్ స్పందించాడు. వేలంలో టీమిండియా సీనియర్ ఆటగాడు కనీస ధరను రూ. 2 కోట్లుగా నిర్ణయించారు.
తొలి సెషన్‌లో ఆసక్తి కనబరచని ప్రాంచైజీలు ఇషాంత్ శర్మను కొనుగోలు చేసేందుకు రెండో సెషన్‌లో కూడా ఆసక్తి కనబరచలేదు. వేలం మధ్యలో సోనీ సిక్సుకు ఇచ్చిన ఇంటర్యూలో గౌతం గంభీర్ మాట్లాడుతూ ఇషాంత్ శర్మ కనీస ధరను ఎక్కువగా నిర్ణయించడం వల్లే వేలంలో అతడు అమ్ముడుపోలేదని చెప్పాడు.
'ఇషాంత్ కనీస ధరను చూసి ఆశ్చర్యానికి లోనయ్యా. నిజం చెప్పాలంటే అది చాలా ఎక్కువ' అని గంభీర్ అన్నాడు. అంతేకాదు తాను ఆ విధంగా మాట్లాడటానికి గల కారణాలను సైతం గంభీర్ వెల్లడించాడు. ఐపీఎల్‌లో టీ20 టోర్నీ. ఈ మ్యాచ్‌లో ఇషాంత్ కేవలం 4 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేస్తాడు.

అదే బెన్ స్టోక్స్ లాంటి ఆటగాళ్ల కనీస ధరను రూ. 2 కోట్లు నిర్ణయించడం వెనుక అతడు బ్యాటింగ్, బౌలింగ్ తో పాటు ఫీల్డింగ్ కూడా రాణిస్తాడని గంభీర్ చెప్పుకొచ్చాడు. ఇషాంత్‌పై గంభీర్ ఏవైతే వ్యాఖ్యలు చేశాడో ఆ వ్యాఖ్యలకు ఐపీఎల్ టాప్ బాస్ మద్దతుగా నిలిచాడు.
'ఇషాంత్ శర్మ కనీస ధరను రూ. 2 కోట్లుగా పెట్టి ఉండాల్సింది కాదు. అతడు టీమిండియా తరుపున ఒక్క టీ20 మ్యాచ్ కూడా ఆడలేదు. కేవలం అతడు టెస్టు ప్లేయర్ మాత్రమే. నిజానికి ఇషాంత్ శర్మ కనీస ధరను రూ. 30లక్షలుగా నిర్ణయించాల్సి ఉంది' అని పేర్కొన్నారు.
ఇషాంత్ శర్మతో పాటు టీమిండియాకు ప్రాతనిథ్యం వహించిన ఛతేశ్వర్ పుజారా, ఇర్ఫాన్ పఠాన్, ఉన్ముక్త్ చంద్, అభినవ్ ముకుంద్, పర్వేజ్ రసూల్, పంకజ్ సింగ్, రాహుల్ శర్మ, ప్రజ్ఞాన్ ఓజాతో సహా మరికొంత మంది ఆటగాళ్లు కూడా అమ్ముడుపోని జాబితాలో ఉన్నారు.
వీరితో పాటు న్యూజిలాండ్ క్రికెటర్లు రాస్ టేలర్, మార్టిన్ గఫ్తిల్, ఇంగ్లండ్ ఆటగాడు జాసన్ రాయ్‌లకు వేలంలో ఆశాభంగం తప్పలేదు. బ్రాడ్ హాగ్ (ఆస్ట్రేలియా), ఇమ్రాన్ తాహిర్ (దక్షిణాఫ్రికా), ఆండ్రూ ఫ్లెచర్ (వెస్టిండీస్)లను కొనుగోలు చేసేందుకు ఫ్రాంచేజీలు ఆసక్తి చూపక పోవడం విశేషం.