హైదరాబాద్: ఐపీఎల్ పదో సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇంకో మ్యాచ్ ఆడాల్సి ఉన్నప్పటికీ ఆ జట్టు స్టార్ బ్యాట్స్‌మెన్ ఏబీ డివిలియర్స్ ముందుగానే వైదొలుగుతున్నాడు. ఈ సీజన్‌లో పాయింట్ల పట్టికలో చివరి స్ధానంలో ఉన్న బెంగళూరు ఆడే చివరి మ్యాచ్‌కు అంత ప్రాముఖ్యత లేకపోవడంతో డివిలియర్స్ దక్షిణాఫ్రికాకు చేరుకోనున్నాడు.
జూన్ 1 నుంచి ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభం కానున్న నేపథ్యంలో టోర్నీకి ముందు దొరికిన సమయాన్ని తన కుటుంబంతో గడిపేందుకు నిర్ణయించుకున్నాడు. ఇదే విషయాన్ని డివిలియర్స్ ట్విటర్ ద్వారా వెల్లడించాడు.
'ఐపీఎల్-2017 నిరాశకు గురిచేసింది. కొన్ని గుణపాఠాలు నేర్చుకున్నాం. వాటిని వచ్చే ఏడాది సీజన్‌లో అమలుచేస్తాం. జూన్ 1 నుంచి జరిగే ఛాంపియన్స్ ట్రోఫీ ముందు కుటుంబాన్ని సొంత ఇంటిలో కలిసినందుకు సంతోషంగా ఉంది' అని ఏబీ డివిలియర్స్ ట్వీట్ చేశాడు.
ఐపీఎల్ పదో సీజన్‌లో ఇప్పటివరకు 13 మ్యాచ్‌లు ఆడిన బెంగళూరు పది మ్యాచ్‌ల్లో ఓటమి పాలైంది. కేవలం రెండు మ్యాచ్ ల్లో మాత్రమే విజయం సాధించగా, సన్ రైజర్స్‌తో జరగాల్సిన మ్యాచ్ రద్దు అయింది. దీంతో బెంగళూరు ఐదు పాయింట్లతో పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉంది.
వచ్చే ఏడాది నిర్వహించే ఐపీఎల్ సీజన్‌లో ఆటగాళ్లందరూ కొత్తగా వేలంలోకి రావల్సి ఉండగా డివిలియర్స్‌ను ఏ జట్టు వేలంలో దక్కించుకుంటుందో చూడాలి మరి.