చండీగఢ్: సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఐపిఎల్ ప్లే ఆఫ్‌లో స్థానాన్ని దాదాపు ఖాయం చేసుకుంది. కెప్టెన్ డేవిడ్ వార్నర్ అర్ధ శతకం, చివరిలో యువరాజ్ సింగ్ అద్భుత బ్యాటింగ్ ప్రదర్శన సన్‌రైజర్స్‌ను పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని సంపాదించిపెట్టాయి. ఆదివారం కింగ్స్ లెవన్ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఏడు వికెట్ల తేడాతో హైదరాబాద్ విజయం సాధించింది.
దీంతో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ తరపున హషీంఆమ్లా చేసిన పోరాటం వృథా అయింది. అంతేగాక, ఈ ఓటమితో ఆ జట్టు ఐపిఎల్ నుంచి నిష్క్రమించింది. పంజాబ్ నిర్దేశించిన 180 పరుగుల లక్ష్యాన్ని సన్‌రైజర్స్ మరో రెండు బంతులు మిగిలి ఉండగా, మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది.
తొలుత బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ 20 ఓవర్లలో నాలుగు వికెట్లకు 179 పరుగులు సాధించింది. ఆమ్లా 56 బంతుల్లో 96 పరుగులు చేసి, నాలుగు పరుగుల తేడాతో సెంచరీని చేజార్చుకున్నాడు. అతని స్కోరులో 14 ఫోర్లు, రెండు సిక్సర్లు ఉన్నాయి.

కెప్టెన్ మురళీ విజయ్ కేవలం 6 పరుగులు చేసి, ముస్తాఫిజుర్ రహ్మాన్ బౌలింగ్‌లో డేవిడ్ వార్నర్ క్యాచ్ అందుకోగా ఔటయ్యాడు. 33 పరుగుల వద్ద పంజాబ్ తొలి వికెట్ కోల్పోయింది. వృద్ధిమాన్ సాహా, గుర్‌కీతర్ సింగ్ చెరి 27 పరుగులు చేసి ఔటయ్యారు. సాహాను దీపక్ హూడా క్యాచ్ పట్టగా మోజెస్ హెన్రిక్స్ పెవిలియన్‌కు పంపాడు.
గుర్‌కీరత్‌ను భువనేశ్వర్ కుమార్ క్లీన్ బౌల్డ్ చేశాడు. క్రీజ్‌లో నిలదొక్కుకొని, జట్టుకు గౌరవ ప్రదమైన స్కోరును అందించేందుకు చెమటోడ్చిన ఆమ్లా చివరి ఓవర్ నాలుగో బంతిలో ఔటయ్యాడు.
పంజాబ్ 20 ఓవర్లలో నాలుగు వికెట్లకు 179 పరుగులు చేసే సమయానికి డేవిడ్ మిల్లర్ (20), గ్లేన్ మాక్స్‌వెల్ (0) నాటౌట్‌గా ఉన్నారు. సన్‌రైజర్స్ బౌలర్లలో భువనేశ్వర్ 32 పరుగులకు రెండు వికెట్లు పడగొట్టాడు. ముస్తాఫిజుర్ రెహ్మాన్, మోజెస్ హెన్రిక్స్ చెరొక వికెట్ కూల్చారు.
చెలరేగిన యువరాజ్
వార్నర్ గట్టి పునాది వేసినా.. మధ్యలో హుడా కీలక ఇన్నింగ్స్ ఆడినా.. ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ విజయంలో కీలక పాత్ర యువరాజ్‌దేనని చెప్పవచ్చు. చాన్నాళ్ల తర్వాత యువరాజ్ ఒత్తిడిలోనూ స్వేచ్ఛగా చెలరేగిపోయాడు. అభిమానులను అరలించడంతోపాటు జట్టుకు విజయాన్నందించాడు.
కాగా, తొలుత వార్నర్ తనదైన శైలిలో చెలరేగడంతో ఛేదనలో హైదరాబాద్‌కు గట్టి పునాది పడింది. ధావన్ (25) నెమ్మదిగా ఆడినా.. వార్నర్ మెరుపులతో పవర్‌ప్లే ముగిసేసరికి సన్‌రైజర్స్ 55/0తో తిరుగులేని స్థితిలో నిలిచింది. అయితే పవర్ ప్లే తర్వాత 4 ఓవర్లలో 23 పరుగులే వచ్చాయి. ధావన్ (25) వెనుదిరిగాడు.

అక్షర్ పటేల్ వేసిన 12వ ఓవర్లో వార్నర్ హిట్‌వికెట్‌గా వెనుదిరిగాడు. దీంతో మ్యాచ్ పంజాబ్ వైపు మొగ్గుతున్నట్లు కనిపించింది. అయితే యువరాజ్.. హుడాతో కలిసి సన్‌రైజర్స్‌ను లక్ష్యం దిశగా నడిపించాడు. హుడా భారీ షాట్లు ఆడి.. సాధించాల్సిన రన్‌రేట్‌ను అదుపులోకి తెచ్చాడు.
16వ ఓవర్లో హుడా ఔటయ్యాక.. తర్వాతి ఓవర్లో స్పిన్నర్ అక్షర్ పటేల్ కేవలం రెండే పరుగులివ్వడంతో సన్‌రైజర్స్‌పై ఒత్తిడి పెరిగింది. చివరి 3 ఓవర్లో 39 పరుగులు అవసరమయ్యాయి. మోహిత్ వేసిన 18వ ఓవర్ మ్యాచ్‌ను మలుపు తిప్పింది.
యువరాజ్ వరుసగా 6, 4 బాదగా.. కటింగ్ (18 నాటౌట్; 11 బంతుల్లో 2సిక్స్‌లు) మరో సిక్సర్ కొట్టడంతో ఈ ఓవర్లో 19 పరుగులొచ్చాయి. చివరి ఓవర్లో 9 పరుగులు చేయాల్సి ఉండగా యువీ రెండో బంతికే భారీ సిక్సర్ బాది హైదరాబాద్ విజయాన్ని ఖాయం చేశాడు.
రెండో బంతిలో ఒక్క పరుగు కూడా లభించలేదు. మూడో బంతిలో యువీ ఒక పరుగు సంపాదించగా, స్కోరు సమమైంది. నాలుగో బంతిలో కట్టింగ్ సింగిల్ తీయడంతో సన్‌రైజర్స్ మరో రెండు బంతులు మిగిలి ఉండగానే విజయం సాధించింది. 24 బంతుల్లో 42(మూడు ఫోర్లు, మూడు సిక్సర్లు) పరుగులు చేసిన యువరాజ్ హైదరాబాద్ విజయంలో కీలకపాత్ర పోషించాడు.