విశాఖపట్నం: ఇండియన్ ప్రీమియర్ లీగ్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ఆడుతున్న స్టార్ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్‌పై సహచర ఆటగాడు శిఖర్ ధావన్ ప్రశంసల వర్షం కురిపించాడు. ప్రపంచ అత్యుత్తమ ఆటగాళ్లలో తన మిత్రుడు యువీకి ప్రత్యేక స్థానం ఉందంటూ కొనియాడాడు.
యువీ క్రీజ్‌లో కుదురుకుంటే మ్యాచ్ స్వరూపాన్ని కొన్ని నిమిషాల్లోనే మార్చేస్తాడని ధావన్ ప్రశంసించాడు. ఇన్నింగ్స్ లో కొన్ని బంతులు మాత్రమే ఆడినా మ్యాచ్‌ను టర్న్ చేసే శక్తి యువరాజ్ సొంతమని చెప్పాడు.
ఆదివారం విశాఖలో ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ 85 పరుగుల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. హైదరాబాద్ 177 పరుగులు చేయగా, ముంబై కేవలం 92 పరుగులకే ఆలౌటైంది. దీంతో ఈ సీజన్లో అతి తక్కువ స్కోరుకే ఆలౌటైన జట్టుగా ముంబై నిలిచింది.

ఈ మ్యాచ్ లో శిఖర్ 10 ఫోర్లు, 1 సిక్స్ సాయంతో అజేయంగా 82 పరుగులు చేయగా.. యువరాజ్ సింగ్ ధాటిగా ఆడి 23బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 39 పరుగులు చేశాడు.
మ్యాచ్ అనంతరం శిఖర్ ధావన్ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్యూలో మాట్లాడుతూ..యువీ ఒక అసాధారణ ఆటగాడని ప్రశంసించాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ మిడిల్ ఆర్డర్ కాస్త బలహీనంగా కనిపిస్తున్నప్పటికీ.. ఓవరాల్‌గా జట్టు మాత్రం సమతుల్యంగా ఉందన్నాడు.
బ్యాటింగ్‌లోనూ, బౌలింగ్ లోనూ సన్‌రైజర్స్ అంచనాలను అందుకుంటూ విజయాలను నమోదు చేస్తోందని తెలిపాడు. తాను ఎంతవరకూ ఆటకు న్యాయం చేయగలనే అనే విషయం తనకు తెలుసని శిఖర్ ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పాడు. పరిస్థితులకు తగినట్లుగా ఆడతానని వెల్లడించాడు.