పుణె: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీకి రూ. 12 లక్షల జరిమానా విధించారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా శుక్రవారం రైజింగ్ పుణె సూపర్‌జెయింట్స్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు జట్టు స్లో ఓవర్ రేట్ కారణంగా కోహ్లీకి ఈ జరిమానా విధించారు.
శుక్రవారం రాత్రి జరిగిన ఈ మ్యాచ్‌లో కోహ్లీ, ఏబి డివిలియర్స్ చెరో అర్ధ శతకంతో రాణించడంతోపాటు తమ జట్టుకు విజయాన్నందించారు. దీంతో 13 పరుగుల తేడాతో మహేంద్ర సింగ్ దోనీ నాయకత్వం వహిస్తున్న రైజింగ్ పుణె జట్టు ఓటమిపాలైంది.

తన జట్టు స్లో ఓవర్ రేట్ నమోదు చేసిన కారణంగా బెంగళూరు కెప్టెన్ అయిన విరాట్ కోహ్లీకి రూ. 12 లక్షల జరిమానా విధించడం జరిగిందని ఐపిఎల్ అధికారులు తెలిపారు. ఐపిఎల్ నిబంధనల మేరకు కోహ్లీకి ఈ జరిమానా విధించడం జరిగిందని చెప్పారు.
కాగా, పుణెతో జరిగిన మ్యాచ్ లో ఏబి డివిలియర్స్ 46 బంతుల్లో 83(6ఫోర్లు, 2 సిక్స్ లు) పరుగులు చేయగా, కోహ్లీ 63 బంతుల్లో 80(7ఫోర్లు, 2 సిక్స్‌లు) పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషింంచారు.
డివిలియర్స్, కోహ్లీ విజృంభణతో ఆ జట్టు 185 పరుగులు చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్ చేసిన పుణె 172 పరుగులు చేసింది. దీంతో 13 పరుగుల తేడాతో బెంగళూరు విజయం సాధించింది.