బెంగళూరు: ఐపీఎల్ 9లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు సారథి విరాట్ కోహ్లీకి ఏమాత్రం కలిసి వచ్చినట్లుగా లేదు. ఇప్పటి వరకు ఏడు మ్యాచులు ఆడిన బెంగళూరు జట్టు కేవలం రెండింటినే గెలిచింది. దాదాపు ప్రతి మ్యాచులోని కోహ్లీ బాగానే ఆడాడు.
అతని ఆట జట్టును ఆదుకోలేకపోయింది. జట్టు ఓడిపోయినప్పటికీ... పరుగులు తీసిన వారిలో వ్యక్తిగతంగా చూసుకుంటే కోహ్లీ మొదటి స్థానంలో ఉన్నారు. అంటే ఈ ఏడాది అతను ఏ రెంజ్‌లో ఆడుతున్నారో అర్థం చేసుకోవచ్చు. ఏడు మ్యాచులలో 433 పరుగులతో అతను తొలి స్థానంలో ఉన్నాడు.
అయితే, ఐపీఎల్లో ఎనిమిది టీంలు ఉండగా కేవలం రెండు విజయాలతో బెంగళూరు మాత్రం ఏడో స్థానంలో ఉంది. దీనికి తోడు బెంగళూరు బౌలర్లు నిర్ణీత సమయంలో ఓవర్లు పూర్తి చేయనందుకు జట్టు కెప్టెన్ అయిన కోహ్లీకి జరిమానా విధించారు.

కెప్టెన్ కోహ్లికి రూ.24 లక్షలు జరిమానా విధించింది. ఇప్పటికే అతనోసారి ఇదే తప్పిదానికి రూ.12 లక్షల జరిమానా ఎదుర్కొన్నాడు. రెండోసారి ఓవర్లు నెమ్మదిగా వేయడంతో జరిమానా రెట్టింపు అయింది. ఈ మొత్తాన్ని విరాట్ కోహ్లీ చెల్లించాడు.
ఇప్పుడు కోహ్లీకి మరో చిక్కు వచ్చి పడే అవకాశముంది. అతనిపై రూ.30 లక్షల జరిమానా పడటమే కాకుండా ఓ ఐపీఎల్ మ్యాచ్ బ్యాన్ కూడా పడనుంది. బౌలర్లు మరోసారి ఇలాగే నిర్ణీత ఓవర్లలో ఓవర్లు పూర్తి చేయకుంటే కోహ్లీ పైన పై వేటు పడనుంది.
ఇప్పటికే తొలుత రైజింగ్ పుణే సూపర్ జెయింట్స్ పైన జరిగిన మ్యాచులో స్లో ఓవర్ రేటింగ్ కారణంగా రూ.12 లక్షలు, కోల్‌కతాతో జరిగిన మ్యాచులో రూ.24 లక్షలు పడింది. మరోసారి ఇలాంటిది జరిగితే రూ.30 లక్షల జరిమానా, తదుపరి మ్యాచ్ ఆడే అవకాశం ఉండదు.