బెంగళూరు: మొదటి సీజన్ నుంచి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో (ఆర్సీబీ) తన ప్రయాణం ప్రత్యేకమని, ఈ జట్టు తరఫున తనను విజయ్ మాల్యా ఎంచుకున్నారని ఆర్సీపీ కెప్టెన్ విరాట్ కోహ్లీ చెప్పాడు. సన్ రైజర్స్ హైదరాబాదుతో మ్యాచ్ కోసం బెంగళూరులో ఉన్నాడు. ఈ సందర్భంగా మాట్లాడాడు.
ఈ జట్టులో ప్రపంచస్థాయి ఆటగాళ్లు ఉన్నారని, వారి నుంచి తాను ఎంతో నేర్చుకున్నానని కోహ్లీ చెప్పాడు. తనకు ఆర్సీబీ అంటే ఎనలేని ప్రేమ అని చెప్పాడు. ఫ్రాంచైజీతో పాటు బెంగళూరు నగరం, ఇక్కడి అభిమానులు తనకు చాలా ఇష్టమని, తనకు ఈ నగరంతో మంచి కనెక్షన్ ఉందని చెప్పాడు.
బ్యాంకులకు రూ.9వేల కోట్లను ఎగ్గొట్టి విదేశాలకు వెళ్లిన మాల్యాను కోహ్లీ ప్రశంసలతో ముంచెత్తాడు. ఆయన వల్ల తాను ఈ స్థాయిలో ఉన్నానని చెప్పాడు. ఐపీఎల్ ప్రారంభంలో ఛాలెంజర్స్ తరఫున ఆటగాడిగా, మాల్యా తనను ఎంపిక చేశాడని గుర్తు చేశాడు. ఆ తర్వాతనే తాను క్రికెట్లో ఉన్నత శిఖరాలకు ఎదిగానని చెప్పాడు. అందుకు మాల్యాకు కృతజ్ఞతలు చెప్పాడు.

కరీబియన్ లీగ్ జట్టు 100 డాలర్లకే: మాల్యా
తాను వెస్టిండీస్‌లో జరిగే కరీబియన్ ప్రిమియర్ లీగ్ (సీపీఎల్)లో బార్బడోస్ ట్రిడెంట్స్ జట్టును కేవలం వంద డాలర్లకే కొన్నానని విజయ్ మాల్యా వెల్లడించాడు. బ్యాంకులకు రుణాలు ఎగ్గొట్టి దేశం విడిచి వెళ్లిపోయిన మాల్యా.. సీపీఎల్ జట్టు విషయంలో నడిపిన లావాదేవీలపై ఆరాలు తీస్తున్న నేపథ్యంలో ఈ విషయం బయటికి వచ్చింది.
మాల్యానే స్వయంగా ఈ విషయాన్ని చెప్పాడు. సీపీఎల్ జట్టు బార్బడోస్‌ను సొంతం చేసుకోవడంలో పెద్ద డ్రామా జరిగిందని, అయితే, జట్టును చేజిక్కించుకోవడానికి నేను పెట్టిన ఖర్చు 100 డాలర్లు మాత్రమేనని, అయితే టోర్నీలో పాల్గొనడానికి చాలా ఖర్చవుతుందని చెప్పాడు.
ఐపీఎల్‌లో లాగా ఇందులో ఫ్రాంఛైజీలకు ఆదాయాన్ని పంచడం ఉండదని, టికెట్లు, స్పాన్సర్‌షిప్ ద్వారానే ఆదాయం సమకూర్చుకోవాలని, మొత్తంగా నిర్వహణ ఖర్చు రెండు మిలియన్ డాలర్ల దాకా అవుతుందని, ఇందుకోసం బార్బడోస్ ప్రభుత్వం రాయితీలిచ్చిందని, లీగ్ తీరుతెన్నులన్నీ పరిశీలించాకే ఆ ప్రభుత్వాన్ని సాయమడిగామని చెప్పాడు. వాళ్లు సుముఖత వ్యక్తం చేశాకే ముందుకెళ్లామని చెప్పాడు.