బెంగళూరు: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో తన విధ్వంసక ఆటతీరుతో అనేకమంది అభిమానులను సంపాదించుకున్న క్రిస్ గేల్ ఈ సీజన్ నుంచి తప్పుకోనున్నాడు. ది యూనివర్స్ బాస్‌గా పేరొందిన క్రిస్ గేల్ ఈ సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ఏ మాత్రం బలంగా కనిపించలేదు. ఫాంలో లేని అతడు మళ్లీ మెరుపు షాట్లతో విరుచుకుపడతాడా? లేక ఇదే ముగింపా? అని అభిమానులు, విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు.
రెండు మ్యాచ్‌లకు దూరమైన క్రిస్ గేల్ మే 11న కింగ్స్ లెవన్ పంజాబ్ జట్టుతో బెంగళూరులో జరిగిన మ్యాచ్‌లో ఆడాడు. కానీ, ఈ మ్యాచ్ లో కూడా ఈ జమైకా ఆటగాడు ఎలాంటి విధ్వంసం చేయలేదు. కేవలం 6 బంతులాడిన గేల్.. 5 పరుగులు మాత్రమే చేయడంతో అభిమానులు నిరుత్సాహానికి గురయ్యారు. ఐపిఎల్ 2016లో 36ఏళ్ల ఈ ఆటగాడు ఆడిన 4వ మ్యాచ్‌లోనూ విఫలమయ్యాడు.
సింగిల్ డిజిట్‌కే పరిమితమవుతున్న గేల్
ఈ సీజన్లో గేల్ వరుసగా 1, 0, 7, 5 పరుగులు చేసి సింగిల్ డిజిట్‌కి పరిమితవడం గమనార్హం. ఆ తర్వాత తన కూతురు బ్లష్‌ను చూసేందుకు స్వదేశానికి వెళ్లిన గేల్.. తిరిగి వచ్చినా ఫాంలోకి రాలేకపోయాడు. అయితే, కెప్టెన్ విరాట్ కోహ్లీ అద్భుతమైన ఫాంలో ఉండటంతో గేల్ ఆడకపోయినా ఎలాంటి ప్రభావం కనిపించడం లేదు.

బెంగళూరు జట్టు బ్యాటింగ్ బాగానే ఉన్నా బౌలింగ్ చాలా దారుణంగా ఉంది. బౌలింగ్ కారణాంగానే పలు మ్యాచుల్లో ఓటమిపాలు కావాల్సి వచ్చింది. ఇప్పుడు బెంగళూరుకు ప్లేఆఫ్ ఆశలు కూడా కనుమరుగయ్యేలా కనిపిస్తున్నాయి. 10 మ్యాచ్‌ల్లో 4 గెలిచిన బెంగళూరు 8పాయింట్లతో 6వ స్థానంలో ఉంది. ప్లేఆఫ్‌కు వెళ్లాలంటే మిగితా 4 మ్యాచ్‌లు తప్పక గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయినప్పటికీ టాప్4లో స్థానం దక్కే అవకాశం దక్కకపోవచ్చు.
ట్వంటీ20లో 175 పరుగుల లక్ష్యమైనా క్రిస్ గేల్ లాంటి ఆటగాడు విధ్వంసం సృష్టిస్తే అది చిన్నదైపోతుంది. అతని విధ్వంసం, డ్యాన్సులు చూసేందుకు చాలా మంది అభిమానులు వస్తుంటారు. అయితే, ఈ సీజన్లో అతని నుంచి అభిమానులకు నిరాశే ఎదురైంది.
ఫాంలో లేడనే కారణంగా గేల్‌ను రైజింగ్ పుణె సూపర్‌జెయింట్స్ జట్టుతో జరిగే మ్యాచ్‌కు కోహ్లీ ఎంపిక చేస్తాడా? లేదా? అనేది తేలాల్సివుంది. అయితే, గేల్ ఏదైనా మ్యాచ్‌లో ఫాంలోకి వస్తే మాత్రం విధ్వంసం ఉండక మానదు.
కాగా, 'గేల్‌కి విశ్రాంతి ఇచ్చేది లేదు. కానీ, వీలైతే అతని స్థానంలో తర్వీష్‌ను తీసుకునే అవకాశం ఉంది. అతని రాకతో మిడిల్ ఆర్డర్ బలపడుతుంది. అంతేగాక, అవసరమైనప్పుడు ఆఫ్ స్పిన్ బౌలింగ్ వేయగలడు. రాహుల్, నేను ఓపెనర్లుగా బాగా కుదురుకున్నాం' అని కోహ్లీ పేర్కొన్నాడు.
'పుణెలో ముగ్గురు లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాట్స్‌మెన్ ఉన్నారు. కాబట్టి, మా జట్టు బౌలింగ్ పటిష్టంగా ఉండాలి. ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో తర్వీష్ బాగా రాణించాడు' అని కోహ్లీ తెలిపాడు. పుణెతో పాటు పంజాబ్ జట్టుతో జరిగే మ్యాచ్‌లకు కూడా గేల్ దూరం కానున్నట్లు తెలుస్తోంది.
ఈ రెండు మ్యాచ్ లను ఆర్సీబీ తప్పక గెలవాల్సి ఉంది. కోహ్లీ, టీం మేనేజ్ మెంట్.. గేల్ పై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అంతకుముందు గేల్ పై నమ్మకం వ్యక్తం చేసిన కోహ్లీ.. ఇప్పుడు అతడ్ని పక్కన పెట్టిన పెద్ద సమస్యేమీ లేదని భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో గేల్ ఈ ఐపిఎల్ సీజన్లో మైదానంలో కనిపించకపోవచ్చు.