హైదరాబాద్: అద్భుతమైన ఆట తీరుతో చెలరేగుతున్న సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు మరో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. శనివారం సొంతగడ్డపై జరిగిన మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుపై పదిహేను పరుగుల తేడాతో గెలిచింది.
తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ కెప్టెన్ వార్నర్ విజృంభించడంతో నిర్ణీత ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 194 పరుగుల భారీస్కోరు నమోదు చేసింది. లక్ష్యఛేదనలో కోహ్లీసేన నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. తొలిసారిగా కెప్టెన్ కోహ్లీ (14) విఫలం అయ్యాడు.

కోహ్లీ ఆట కోసం ఎదురు చూసిన హైదరాబాదీయులకు అతను నిరాశను మిగిల్చాడు.మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ (51; 28 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్సర్) రాణించాడు. బంగ్లా పేసర్ ముస్తాఫిజుర్ బౌలింగ్‌లో తడబడుతూనే ఆడిన కోహ్లీ అతనికే వికెట్ సమర్పించి పెవిలియన్ చేరాడు.
ఇదిలా ఉండగా, వార్నర్ కొట్టిన ఓ షాట్ ధోనీ హెలికాప్టర్ షాట్‌ను తలపించింది. వార్నర్ ఆటను ప్రత్యర్థి అయిన కోహ్లీ కూడా చప్పట్లతో ఓ సమయంలో ప్రశంసించాడు. వార్నర్ ఓ షాట్‌ను సిక్సర్‌గా కొట్టాడు. ఆ షాట్ ధోనీని తలపించింది. దీంతో కోహ్లీ చప్పట్లు కొట్టాడు.