చెన్నై: ఒంటి చేత్తో జట్టుకి విజయాన్ని అందించగల యువరాజ్ సింగ్ నుంచి ఈ ఏడాది భారీ విజయాలను ఆశిస్తున్నట్లు ఢిల్లీ డేర్ డెవిల్స్ నూతన కెప్టెన్ జేపీ డుమిని తెలిపారు. యువరాజ్ సింగ్‌ను ఢిల్లీ డేర్ డెవిల్స్ ఈ ఏడాది జరిగిన ఐపీఎల్ వేలం పాటలో రూ. 16 కోట్లు వెచ్చించి కోనుగోలు చేసిన విషయం తెలిసిందే.
అంతే కాదు టోర్నమెంట్ మొత్తంలో అత్యధిక ధర పలికిన ఆటగాడు కూడా యువీనే కావడం విశేషం. ఐపీఎల్ వేలం పాటకు ముందు యువరాజ్ సింగ్ రంజీల్లో వరుస సెంచరీలు చేశాడు. దీంతో ఢిల్లీ జట్టులో కీలకమైన ఆటగాడిగా యువరాజ్ సింగ్ ఉన్నాడు.

భారత జట్టులో యువరాజ్ సింగ్ సభ్యుడు కాకపోయినా ఢిల్లీ కెప్టెన్ జేపీ డుమిని మాత్రం ఆశలన్నీ యువీపైనే పెట్టుకున్నాడు. ఐపీఎల్ టీ20 వెబ్‌సైట్‌కి ఇచ్చిన ఇంటర్యూలో జేపీ డుమిని మాట్లాడుతూ గత కొంతకాలంగా భారత జట్టులో యువీ ఆడని విషయంతో నాకు సంబంధం లేదు. అతను మ్యాచ్ విన్నర్ అని అందరికీ తెలుసు. ఈ ఏడాది ఢిల్లీ కోసం అతను ఒంటి చేత్తో విజయాలను అందిస్తాడనే నమ్మకముందని చెప్పాడు.
గత కొన్నేళ్లుగా యువరాజ్ సింగ్ ప్రదర్శనను చూస్తునే ఉన్నామని, ఈసారి మాత్రం యువీపై ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టు భారీగా ఆశలు పెట్టుకుందన్నాడు. రెండు సార్లు ఐపీఎల్ ఛాంపియన్లుగా అవతరించిన చెన్నై సూపర్ కింగ్స్‌తో ఢిల్లీ డేర్ డెవిల్స్ ఈరోజు తొలి మ్యాచ్‌లో తలపడనుంది. గత ఏడాది జరిగిన ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరుతో తలపడింది.