హైదరాబాద్: సొంత మైదానం ఉప్పల్ స్టేడియంలో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ పేలవమైన ప్రదర్శనతో అభిమానులను నిరాశ పరచింది. ముంబై ఇండియన్స్ బౌలర్లను ప్రత్యేకించి మిచెల్ మెక్‌క్లీనగన్‌ను సమర్థంగా ఎదుర్కోలేక పరుగుల వేటను కొనసాగించలేక చేతులెత్తేసింది.
ఫలితంగా 113 పరుగుల అత్యంత సాధారణమైన స్కోరుకే ఆలౌటైంది. దానిని ముంబై ఇండియన్స్ కేవలం ఒక వికెట్ కోల్పోయి 13.5 ఓవర్లలో చేధించింది. దీంతో, ఈ సీజన్‌లో ప్లేఆఫ్ బెర్త్ వార్నర్‌సేనకు అందని ద్రాక్షగానే మిగిలిపోయింది.

గెలిస్తేనే ప్లేఆఫ్ చేరే మ్యాచ్‌లో హైదరాబాద్ చెత్త ప్రదర్శనతో చిత్తుగా ఓడింది. దీంతో, రోహిత్ సేన 14 మ్యాచ్‌ల్లో ఎనిమిది విజయాలతో 16 పాయింట్లు సాధించి రెండో స్థానంలో నిలిచింది. ఇక క్వాలిఫయర్-1 (మంగళవారం) మ్యాచ్‌లో చెన్నైతో ముంబై తలపడనుంది. ఏడో ఓటమితో సన్‌రైజర్స్ టోర్నీ నుంచి నిష్క్రమించింది.
మెక్లెనగన్ (3/16), మలింగ (2/17), సుచిత్ (2/14) విజృంభణకు సిమన్స్ (48), పార్థివ్ (51 నాటౌట్) మెరుపులు తోడుకావడంతో ముంబై 9 వికెట్ల తేడాతో సన్‌రైజర్స్‌పై ఘన విజయం సాధించింది.
తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ 20 ఓవర్లలో 113 పరుగులకే ఆలౌటైంది. లోకేష్ రాహుల్ (25) టాప్ స్కోరర్. అనంతరం ముంబై 13.5 ఓవర్లలో వికెట్ మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. మెక్లెనగన్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచాడు.
స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకోవడం సన్‌రైజర్స్ బౌలర్లకు కష్టమైంది. హైదరాబాద్ బ్యాట్స్‌మెన్ తడబడిన చోటే ముంబై ఓపెనర్లు సిమన్స్, పార్థివ్ స్వేచ్ఛగా బ్యాట్ ఝుళిపించారు.
ఈ జోడీ తొలి వికెట్‌కు 106 పరుగుల భాగస్వామ్యంతో గెలుపు తేలిక చేసింది. ఆరంభం నుంచే వీరిద్దరూ వీలు చిక్కినప్పుడల్లా భారీ షాట్లతో విరుచుకుపడ్డారు. ఇక కర్ణ్‌శర్మ వేసిన 12వ ఓవర్‌లో సిమన్స్ 4, 4, 6, 6తో జోరు ప్రదర్శించాడు. చివర్లో సిమన్స్ అవుటయ్యాక రోహిత్ (7 నాటౌట్)-పార్థివ్ గెలుపు లాంఛనం పూర్తి చేశారు.